చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి వచ్చిన మరో సినిమా.. మేం ఫేమస్. ఈ సినిమా ప్రమోషన్లను చాలా భారీగా చేశారు. పబ్లిసిటీ చూస్తే.. చిన్న సినిమా, కొత్త వాళ్లతో తీసిన సినిమా అని ఎక్కడా అనిపించలేదు. మహేష్ బాబు సైతం విడుదలకు ముందు ఈ సినిమా గురించి పాజిటీవ్ ట్వీట్ వేశాడు. ఇప్పుడు రాజమౌళి వంతు వచ్చింది. సాధారణంగా బయటి సినిమాల గురించి జక్కన్న పెద్దగా మాట్లాడడు. తనకూ, తన సినిమాలకూ సంబంధం లేని వ్యక్తుల గురించీ, వాళ్ల సినిమాల గురించీ అస్సలు పట్టించుకోడు. ఎప్పుడైనా ఒకటీ అరా ట్వీట్ వేస్తే.. అది నాని సినిమానే అయ్యి ఉంటుంది. ఈమధ్య అదీ లేదు. చాలా కాలం తరవాత.. ఓ సినిమా చూసి, బాగుందంటూ మెచ్చుకొని ట్వీట్ కూడా చేశాడు రాజమౌళి.
మేం ఫేమస్ సినిమా తనకు బాగా నచ్చిందని, చాలా కాలం తరవాత థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశాడు జక్కన్న. దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ కి మంచి మార్కులు వేశాడు. తన ప్రతిభ ఆకట్టుకొందంటూ మెచ్చుకొన్నాడు. అన్ని పాత్రలూ నచ్చాయని చెప్పిన రాజమౌళి.. ప్రధానంగా అంజిమామ పాత్రకు ఇంకొన్ని ఎక్కువ మార్కులేశాడే. ఈ సినిమాని హైలీ రికమెండెడ్ లిస్టులో చేర్చేశాడు జక్కన్న. విడుదలైన రోజున ఈ సినిమాపై నెగిటీవ్ బజ్ నడిచింది. రివ్యూలూ అలానే వచ్చాయి. కానీ సెలబ్రెటీలు మాత్రం వరుస ట్వీట్లతో హోరెత్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.