మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా దాదాపుగా ఖాయమైపోయినట్టే. ఇటీవల ఆమెపై లుక్ టెస్ట్ జరిగింది. రాజమౌళి అన్ని రకాలుగా ఆలోచించే ప్రియాంకాను ఫైనల్ చేశారు. అయితే ప్రియాంక రాక… మహేష్ అభిమానులకు బొత్తిగా నచ్చడం లేదని తెలుస్తోంది. మహేష్ పక్కన ప్రియాంక చాలా ముదురుగా కనిపిస్తుందన్నది వాళ్ల వాదన. ప్రియాంక వయసు 42. మహేష్ తో పోలిస్తే ఏడేళ్లు చిన్నదే. కాకపోతే ఈ జోడీ అంత చూడ ముచ్చటగా ఉండదన్నది మహేష్ ఫ్యాన్స్ భయం. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబో గురించి రకరకాలుగా అనుకొంటున్నారు. ప్రియాంక కంటే మంచి హీరోయిన్ని వెదికి పట్టుకోవాల్సింది కదా అని అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది. ప్రియాంక పాత్ర రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్లా ఉండదని సమాచారం. ఈ సినిమాలో ప్రియాంక ఓ కీలక పాత్రధారి. కథానాయికగా మరొకరు కనిపించే అవకాశం వుంది. ఈ సినిమా కోసం కొంతమంది విదేశీ కథానాయికలకు ఆడిషన్స్ జరిగాయి. ఇండోనేషియా నుంచి ఓ నటిని ఎంచుకొన్నారని సమాచారం. తనే.. ప్రధాన కథానాయిక కావొచ్చు. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలో చాలామంది ఫారెన్ నటీనటులు ఉంటారని సమాచారం. అసలు సిసలైన పాన్ వరల్డ్ సినిమాగా మహేష్ చిత్రాన్ని మలచాలని రాజమౌళి భావిస్తున్నారు. అందుకే ఈసారి విదేశీ నటీనటులకు పెద్ద పీట వేస్తున్నారని సమాచారం. ప్రియాంక హీరోయిన్ కాకపోతే చాలు. మహేష్ ఫ్యాన్స్ కు ఇంత కంటే పెద్ద శుభవార్త ఉండదు. మరి ఈ ట్విస్ట్ ని రాజమౌళి ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.