తెలుగు సినిమాని సాంకేతికంగా ఒకమెట్టు కాదు.. ఏకంగా పది మెట్లు ఎక్కించిన ఘనత నిస్సందేహంగా రాజమౌళిదే. మగధీర, ఈగ, బాహుబలి… ఇలా రాజమౌళి ప్రస్థానం దిగ్విజయంగా సాగుతూనే ఉంది. టెక్నికల్‌గా జక్కన్న ఎంత స్ట్రాంగో.. ఎప్పటికప్పుడు నిరూపించుకొంటూనే ఉన్నాడు. రాజమౌళిని చూసి ‘డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి..’ అని సంబరపడుతుంటుంది తెలుగు చిత్రసీమ. అయితే.. రాజమౌళి దర్శకుడు కావాలని ఇండ్రస్ట్రీకి రాలేదట. ముందు హీరో అవ్వాలనుకొన్నాడట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పుకొచ్చాడు.
”చిన్నప్పుడు హీరో కావాలనుకొనేవాడ్ని. ఆ విషయం అందరికీ చెబితే నవ్వేవారు. నాకూ సిగ్గుగానే ఉండేది. కానీ కాంచీ అన్నయ్య ‘హీరో అవ్వాలంటే ఈ ఊర్లోనే కూర్చుంటే అవ్వవు… మద్రాస్ వెళ్లు.. అక్కడ ట్రై చేయ్’ అని సలహా ఇచ్చాడు. దాన్ని పాటించా. అయితే కాలక్రమంగా హీరోపై దృష్టిపోయి దర్శకత్వంవైపు మనసులాగింది” అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. అన్నట్టు ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో షో టైమ్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి ఇలా తన ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాల్సివచ్చింది. ఒకవేళ నిజంగానే రాజమౌళి హీరో అయిపోయుంటే మగధీర, బాహుబలి లాంటి సినిమాల్ని మనం మిస్సయిపోయేవాళ్లం కదా..??