సినిమా కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధ పడే ప్రొఫెషనల్ కథానాయికల్లో అనుష్క పేరు కూడా ఉంటుంది. రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో సినిమాల కోసం అనుష్క చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. సైజ్ జీరో కోసం 20 కిలోల వరకూ పెరిగింది అనుష్క. ఎప్పటికప్పుడు సన్నజాజిలా మారిపోవాలనుకొనే కథానాయికలున్న రోజుల్లో.. పాత్ర కోసం బరువు పెరిగి శభాష్ అనిపించుకొంది. అనుష్క భలే మారిపోయింది అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ బరువే అనుష్కకి సమస్యల్ని తెచ్చిపెడుతోంది.
సైజ్ జీరో షూటింగ్ అయిపోయిన వెంటనే బరువు తగ్గాలని అనుష్క ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే బరువు పెరిగినంత తేలిక కాదు.. తగ్గడం. సైజ్ జీరో షూటింగ్ పూర్తయి 4 నెలలైనా అనుష్క బరువులో అంతగా మార్పు రాలేదు. నాలుగు నెలలు కఠోరంగా శ్రమించినా అనుష్క ఆరు కిలోల బరువు కంటే తగ్గలేదట. ఈ విషయంలో అనుష్క కాస్త కిందామీదా పడుతోంది. తాజాగా నాగార్జున సినిమాలో ఆఫర్ అందుకొంది స్వీటీ. ఈ పాత్రకు కాస్త బొద్దుగా ఉన్నా ఫర్వాలేదుగానీ.. బాహుబలి 2 కోసమైనా అనుష్క కాస్త స్లిమ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జక్కన్న అనుష్కకి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అర్జెంటుగా బరువు తగ్గాల్సిందే.. అని అనుష్కని తొందర పెడుతున్నాడట. ఈ సినిమా కోసం ప్రభాస్ – అనుష్కల మధ్య ఓ కత్తి యుద్దం సన్నివేశాన్ని తెరకెక్కించాలి. ఆ సన్నివేశం తెరకెక్కించేలోగా స్లిమ్మవ్వాలని జక్కన్న తేల్చి చెప్పేశాడట. పాపం.. అనుష్కకు సైజ్ జీరో సినిమా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో కదూ.