రచయితగా విజయేంద్ర ప్రసాద్ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఎస్.ఎస్. రాజమౌళి సాధిస్తున్న విజయపరంపర వెనుక… కథా రచయితగా విజయేంద్రుడి వాటా కూడా ఉంది. విజయేంద్ర ప్రసాద్ కథలకు రాజమౌళి ఒక్కడే న్యాయం చేయగలడు అనే అపవాదు భజరంగీ భాయ్ జాన్‌తో తొలగిపోయింది కూడా. బాహుబలి, భజరంగీ భాయ్ జాన్.. రెండు సినిమాలూ దేశం ఆశ్చర్యపోయే వసూళ్లను అందుకొన్నాయి. విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగేలా చేశాయి. కథా రచయితగా ఎంత సంతృప్తి కరమైన ప్రయాణం సాగిస్తున్నాడో, దర్శకుడిగా అంత తేలిపోతున్నాడు విజయేంద్ర ప్రసాద్. శ్రీకృష్ణ అంటూ అప్పుడెప్పుడో దర్శకుడిగా ఓ ప్రయత్నం చేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చాలా కాలం తరవాత నాగార్జునతో రాజన్న తీశాడు. ఈ సినిమా వెనుక రాజమౌళి కృషి, తాపత్రయాలు ఉన్నా… వర్కవుట్ కాలేదు. దర్శకుడిగా ఫ్లాప్ ముద్ర పడిపోయింది.
బహుశా రాజమౌళిని తొలచేస్తున్న సంగతి అదే కావొచ్చు. తన తండ్రి దర్శకుడిగా ఫెయిల్యూర్ అవ్వడం రాజమౌళికి పెద్ద లోటుగా కనిపిస్తోంది. `నాన్న దర్శకుడిగానూ హిట్ కొట్టాల్సిందే` అని పదే పదే పరితపిస్తున్నాడు రాజమౌళి. శ్రీవల్లి ఆడియో ఫంక్షన్లో రాజమౌళి మాట్లాడిన తీరు చూస్తుంటే తన తండ్రికి హిట్ దక్కాలని ఎంత పరితపించి పోతున్నాడో అర్థం అవుతోంది. ఓ కొడుకుగా తన తండ్రి స్టామినా తనకు తెలుసని, దర్శకుడిగా తన తండ్రితోనే పోటీ పడతానని.. రాజమౌళి చెప్పుకొచ్చాడు. శ్రీవల్లి ట్రైలర్ చూస్తుంటే… ఇదేదో సరికొత్త ప్రయత్నం.. ప్రయోగంలానే అనిపిస్తోంది. అయితే ఇంతలోనే మరో డౌటు పుట్టుకొస్తోంది. నిజంగానే ఇది అద్భుతమైన కథ అయితే… రాజమౌళి ఎందుకు వదులుకొంటాడు? ఎప్పట్లానే తన తండ్రి కథతో తన దర్శకత్వంలోనే ఓ సినిమా తీస్తాడు కదా?? మరి రాజమౌళి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? లేదంటే ఈ కథతో సినిమా తీస్తే తన తండ్రి కూడా నిరూపించుకోగలడని భావించి.. ఈ కథని తండ్రికి త్యాగం చేశాడా?? అనే అనుమానాలూ వస్తున్నాయి. మొత్తానికి శ్రీవల్లి విజయేంద్రుడికే కాదు… రాజమౌళికీ ఓ పరీక్ష లాంటిది. మరి అంతిమ ఫలితం ఏమిటో తెలియాలంటే శ్రీవల్లి వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.