ఆ సంగతి చాలా పెద్ద రహస్యం. కాకపోతే ఎప్పటికైనా బహిరంగం అయితే తప్ప విలువ ఉండని రహస్యం అది! ఆ రహస్యానికి సంబంధించి.. ఒక వైపు… అధికారిక ప్రకటన వెలువడింది. కొందరిలో ఆనందోత్సాహాలు రేగవచ్చు. కానీ రెండో వైపు నుంచి కూడా ఏదైనా అధికారికంగా ప్రకటన వస్తే తప్ప… స్వయంగా సూపర్‌స్టార్ తన నోటితో వెల్లడిస్తే తప్ప ఆ విషయాన్ని నమ్మడానికి వీల్లేదు. ఇది మన టాలీవుడ్ సూపర్స్టార్లకు సంబంధించిన రహస్యం ఎంతమాత్రమూ కాదు. కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కు సంబంధించిన రహస్యం. ఆయన ఇంతకూ కనీసం ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో అయినా ఏదైనా పార్టీ తరఫున ప్రచారానికి దిగబోతున్నారా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఆయన ప్రచారం కోసం ఆశగా నిరీక్షిస్తున్న భారతీయ జనతా పార్టీ మాత్రం.. తమ పార్టీ తరఫున ప్రచార బరిలోకి దిగడానికి రజినీకాంత్ అంగీకరించినట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కానీ స్వయంగా సూపర్‌స్టార్ కోటరీనుంచి ప్రకటన వస్తే తప్ప నమ్మలేం అని అంతా భావిస్తున్నారు.
రజనీకాంత్ రాజకీయ అనుబంధాల గురించి తమిళనాట ఉన్నన్ని పుకార్లు మరెక్కడా ఉండవేమో అంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రతిసినిమా విడుదలకు ముందు రాజకీయ ప్రవేశం గురించి కొన్ని పుకార్లు పుట్టడం… విడుదలయ్యే సినిమాల్లో రాజకీయ వాసనలతో కొన్ని డైలాగులు ఉండడం, ఆ ట్రైలర్లతో అభిమానుల్ని రెచ్చగొట్టి ఓపెనింగ్స్ సాధించడం.. ఇదంగా ఒక ట్రిక్కులాగా మారిపోయింది. ఈసారి మళ్లీ రజినీకాంత్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా.. ఆయన భాజపా తరఫున ప్రచారానికి దిగుతాడనే పుకార్లు వస్తున్నాయి.
అయినా.. తమిళనాట ఎన్నికలు ఎప్పుడూ అయితే జయలలిత, లేకుంటే కరుణానిధికి ఏకపక్షంగా మెజారిటీ కట్టబెట్టే ధోరణిలోనే సాగుతాయి. మధ్యస్తంగా తీర్పు ఇవ్వడం, లేదా మూడో పక్షానికి అవకాశం ఇవ్వడం అనేది తమిళ ప్రజలకు ఎన్నడూ అవకాశం లేదు. అలాంటి నేపథ్యంలో ఆ రెండు దిగ్గజ పార్టీలు తలపడుతున్న బరిలో విజయకాంత్ సారథ్యంలోని కూటమి పరిస్థితే డౌట్‌ఫుల్‌గా ఉంటే.. తమిళనాడులో తమకంటూ నిర్దిష్టంగా ఒక శాతం ఓట్లు, ఒక సీటుకు కూడా ఠికానా లేని భారతీయజనతా పార్టీకి ఏం జనాదరణ దక్కుతుందని వాదిస్తున్న వారు కూడా ఉన్నారు.
సాక్షాత్తూ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రచారం బరిలోకి దిగినా.. భాజపాకు అక్కడ దిక్కూమొక్కూ ఉండదని, ఇలాంటి పరువు తక్కువ పనికి ఆయన సాహసించకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.