వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని.. గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెంకయ్య, రజనీకాంత్ అతిధులుగా వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్ ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయనన్నారు. కానీ తాను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు.. వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిజానికి వెంకయ్యనాయుడు కూడా ఇదే అసంతృప్తిలో ఉన్నారు. ఆయన కేంద్రంలో చురుకైన పాత్ పోషిస్తున్న సమయంలో హఠాత్తుగా ఉపరాష్ట్రపతి పదవికి మోదీ, షా ఎంపిక చేశారు. పార్టీ నిర్ణయం అని చెప్పి వెంకయ్యను ఒప్పించారు.దీంతో ఆయన ఉపరాష్ట్రపతి పదవి తీసుకుని ప్రత్యక్ష, రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. తర్వాత రాష్ట్రపతి పదవి అని ఆశలు పెట్టినప్పటికీ ఏ చాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు ఇక మళ్లీ బీజేపీ తరపున రాజకీయాలు చేయడానికి ఆసక్తి లేదని వెంకయ్య చెబుతున్నారు. అదే సమయంలో ఆయనకు యాక్టివ్ పార్ట్ ఇవ్వడానికి బీజేపీ నేతలు కూడా సిద్ధంగా లేరు.
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు కూడా రాజకీయాలు చేయాలంటే… ఆరోగ్యం చేలా ముఖ్యమని.. రజనీకాంత్ ను రాజకీయాల్లోకి రావొద్దని తానే సలహా ఇచ్చానన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఒక్కటే మార్గం కాదన్నారు. అయితే రాజకీయాల్లోకి రాకుండా తాను ఎవర్నీ నిరాశపర్చడం లేదని యువత పెద్ద ఎత్తున రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.