తమిళనాట రజనీకాంత్ కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. ఈ మాట ఎప్పటి నుండో చెబుతున్నదే. సినిమా కెరీర్ ముగిసిపోయిందని.. రాజకీయాల్లోకి వస్తున్నారని… ఆయనపై ఇప్పటికే విమర్శలు ప్రారంభించారు. దీనికి కౌంటర్‌గా ఏమో కానీ.. తాను పార్టీ పెడతాను కాను ముఖ్యమంత్రి పదవి తీసుకోనని ప్రకటించారు. బాగా చదువుకున్న వ్యక్తిని ముఖ్మయంత్రిని చేస్తానని తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాకపోయినా.. కరుణానిధి, జయలలితలు లేకపోవడంతో రాజకీయశూన్యత కనిపిస్తోందని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశారు.
నా వయసు ఇప్పుడు 68 సంవత్సరాలు.. నాకు ఇప్పుడు సీఎం పదవి అవసరమా?. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను. సీఎం అభ్యర్థిని తయారుచేస్తానని రజనీకాంత్ గంభీరంగా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వంలో జోక్యం చేసుకోబనన్నారు. యువతకు మెజార్టీ అవకాశాలు కల్పిస్తానన్నారు. అలాగే… విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. రెండేళ్ల కిందట రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటి నుండి రజనీకాంత్ ఊగిసలాటలోనే ఉన్నారు. ఆయన తన అభిమాన సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే వేదికను ప్రారంభించారు కానీ… ఆ తర్వాత ఏదీ తేల్చి చెప్పడం లేదు. అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ.. అటా.. ఇటా.. అనే సందేహాలు వచ్చేలా చేశారు.
ఇప్పుడు కూడా రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు కానీ.. ఎప్పుడు పెడతారో చెప్పడం లేదు. అయితే.. తాను సీఎం కాదని ప్రకటించడం ద్వారా పదవీ వ్యామోహం లేదని.. తమిళనాడు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం చేశారన్న భావన ఏర్పడుతోంది. రజనీకాంత్ తమిళుడు కాదన్న వాదన కొన్ని రోజులుగా ఉద్యమంలా తమిళనాడులో నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను సీఎం అభ్యర్థి కాదని చెప్పుకోవడం వ్యూహమనే భావిస్తున్నారు. రజనీకాంత్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా.. ఆయననే సీఎంగా ఉండాలని డిమాండ్ చేస్తారు. వారందరి కోరిక మేరకు రజనీకాంత్ సీఎం పదవి చేపట్టడం ఖాయం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. తెలంగాణ ఏర్పడితే దళితుడే సీఎం.. తాను కాదని ప్రకటించారు. తర్వాత జరిగింది వేరు. ఇదే ఫార్ములాను రజనీకాంత్ ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.