ఊరకే ఉంటే ఊరా పేరా అని సామెత! తమిళనాట అమ్మ’ జయలలితకు, ‘అయ్య’ కరుణానిధికి ప్రత్యామ్నాయంగా తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న కెప్టెన్ విజయకాంత్.. ఇప్పుడు తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్‌తో సున్నం పెట్టుకున్నాడు. ఏదో ఒక వివాదాన్ని తన చుట్టూ సృష్టించుకుంటే తప్ప.. జనంలోకి క్రేజీ ఎంట్రీగా ఇవ్వడం కుదరదని అనుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే రజినీకాంత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి… తలైవా ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నారు.
ప్రజా సంక్షేమ కూటమి పేరిట ఉన్న మూడో కూటమి తరఫున విజయకాంత్ సీఎం అభ్యర్థి అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆయన హఠాత్తుగా తన ప్రసంగంలోకి రజనీకాంత్‌ను కూడా తీసుకువచ్చారు. రాజకీయ నాయకులు భయపెడితే భయపడడానికి తానేమీ రజనీకాంత్‌లాగా పిరికివాడిని కానంటూ కెప్టెన్ హూంకరించారు. తనకు అలవిమాలినంత ధైర్యం ఉన్నదని ఆయన చెప్పుకుంటే ఎవరికీ ఏమీ నష్టం లేదు కానీ.. ఆ మాట చెప్పుకోవడం కోసం.. మధ్యలో రజనీ ప్రస్తావన తెచ్చి ఆయన పిరికివాడని కామెంట్లు చేయడం ఎందుకు? అనేది జనం సందేహం.
అసలే రజనీకాంత్‌కు తమిళనాట పార్టీ రహితంగా అభిమానులు ఉన్నారని అందరికీ తెలిసిందే. వేలం వెర్రిగా ఆయనను ఆరాధిస్తుంటారు. రజనీకాంత్ ఎన్నడూ రాజకీయ కామెంట్లు కూడా చేసి వివాదాల్లోకి రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. అలాంటిది రజనీని పిరికివాడు అని సంబోధిస్తూ మాట్లాడడం ఇప్పుడు కెప్టెన్‌కు నష్టం చేస్తుందా? అనేది తమిళ తంబీల చర్చ.