తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. అయితే ఏ అంశంపై కలిశారన్నదానిపై స్పష్టత లేదు. కేవలం మర్యాదపూర్వకంగానే సమావేశం జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు కానీ రాలేదు. అనారోగ్య కారణాలతో పార్టీ ఏర్పాటు ప్రకటనను విరమించుకున్నారు. ఇప్పుడు పూర్తి సమయం సినిమాలకే కేటాయిస్తున్నారు.
చంద్రబాబుతో రజనీకాంత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే హైదరాబాద్ వచ్చినప్పుడు లేదా చంద్రాబబు అందుబాటులో ఉన్నప్పుడు.. కలుస్తూ ఉంటారని చెబుతూంటారు. కుటుంబంలో శుభకార్యాలకూ రజనీకాంత్ ఆహ్వానిస్తూ ఉంటారని చెబుతూంటారు. అయితే పవన్ కల్యాణ్ కలిసిన ఒక్క రోజులోనే రజనీకాంత్ కూడా చంద్రబాబు ఇంటికి వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.
మోహన్ బాబు, రజనీకాంత్ ఆప్తమిత్రులు, గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఎన్నికలకు ముందుకు నడి రోడ్డుపై డ్రామా చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా అప్పుడప్పుడూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య ఓ సారి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. కారణం ఏదైనప్పటికీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబును ప్రముఖులు కలుస్తున్నారంటే.. ఏదైనా రాజకీయం ఉందా అనే విశ్లేషణ ప్రారంభమవుతుంది. రజనీకాంత్ ఏ కారణంతో చంద్రబాబును కలిశారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.