నందమూరి బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు పాత్రకి తగిన నటుడు దొరికేశాడా? అవుననే అంటున్నాయి బాలకృష్ణ సన్నిహిత వర్గాలు. ఈ పాత్రలో రాజశేఖర్ కనిపించే అకాశాలున్నాయని తెలుస్తోంది. ఈమధ్య బాలయ్య – రాజశేఖర్ల మధ్య దోస్తీ పెరిగింది. గరుడవేగ ప్రచార కార్యక్రమానికి బాలయ్యని ఆహ్వానించాడు రాజశేఖర్. అక్కడ బాలయ్యని రాజశేఖర్…. రాజశేఖర్‌ని బాలయ్య పొగుడుకున్నారు. ”బాలయ్య సినిమాలో చిన్న పాత్ర అయినా కనిపించడానికైనా రెడీనే” అని వేదికపై రాజశేఖర్ చెబితే..”చిన్న పాత్ర ఎందుకు.. హీరోలుగానే చేద్దాం” అంటూ బాలయ్య కూడా మాట ఇచ్చాడు.
అప్పటి నుంచి ఇద్దరూ కలిసి నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి హాజరైన ఒకే ఒక్క కథానాయకుడు కూడా… రాజశేఖరే. బాలయ్య నుంచి ఆయనకు మాత్రమే ఆహ్వానం అందింది. దాంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో రాజశేఖర్ కూడా నటిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్యకు అవకాశం ఉందని, అయితే ఆయనకు ఎలాంటి పాత్ర ఇవ్వాలా అనేది ఇంకా ఆలోచించుకోలేదని… బాలకృష్ణ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. బాలకృష్ణ మదిలో మాత్రం రాజశేఖర్‌కి చంద్రబాబు పాత్ర ఇవ్వాలని ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.