రాజశేఖర్.. యాంగ్రీ యంగ్ మెన్‌గా గుర్తింపు పొందిన ఈ కథానాయకుడిగా ఏళ్ల తరబడి సరైన సినిమా లేదు. ఆ మాటకొస్తే.. ఆయన కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. రాజశేఖర్‌ని చిత్రసీమ మర్చిపోతోందేమో అనుకొంటున్న తరుణంలో ఆయన్నుంచి వస్తున్న సినిమా గరుడ వేగ. మామూలుగా అయితే ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోకపోదురు. కానీ.. వరుస విజయాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకొని, జాతీయ అవార్డు కూడా సాధించిన ప్రవీణ్ సత్తారు నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఫోకస్ పెరిగింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. ఇప్పుడు టీజర్ వచ్చింది. రూ.25 కోట్లు ఎందుకు ఖర్చయ్యిందో చూపించడానికి అన్నట్టు.. టీజర్లో షాట్లు.. భారీగానే చూపించారు. మేకింగ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. అయితే… గరుడ వేగ మిషన్ ఏమిటన్నది టీజర్లో అర్థం కాలేదు. నక్షత్ర తాబేళ్లు అనే మాట మాత్రం వినిపించింది. అదేమైనా సరదాగా వాడారా? లేదంటే.. సముద్రాని ఆసరాగా చేసుకొని రెచ్చిపోతున్న మాఫియాపై రాజశేఖర్ చేసే మిషన్ కోసం ఆ పదం వాడారా? అనేది సినిమా చూస్తే గానీ అర్థం కాదు. ఇప్పటి వరకూ సాఫ్ట్, మసాలా కథల్ని తీసిన ప్రవీణ్ సత్తారు, ఈసారి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథతో వస్తున్నాడు. మరి ఈ మిషన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.