ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే నిజమవుతుంటే – అంటూ పాట పాడుకొంటూ సందడి చేయాల్సిన తరుణం వచ్చేసింది రాజశేఖర్‌కి. అవును మరి.. గరుడ వేగ లాంటి సినిమా కోసం ఎన్నాళ్లు, ఎన్నేళ్లు ఎదురు చూశాడో, సెకండ్ ఆఫ్ కాస్త జోష్ తగ్గింది గానీ, లేదంటే ఇదో ట్రెండ్ సెట్టర్ అవుదును అని ముక్తకంఠంతో చెబుతున్నారంతా. అంతకంటే ఏం కావాలి?? మిగిలిన రెండు సినిమాలో పోలిస్తే వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ రాజశేఖర్‌కి ఇది మాత్రం సరిపోదు.. ఇంతకు మించి కావాలి. ఎందుకంటే ఈ సినిమాపై దాదాపుగా రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టారు. దాన్ని రాబట్టుకోవడం శక్తికి మించిన పనే. అన్ని ఏరియాలూ `అడ్వాన్స్`తో సరిపెట్టుకొని వదిలేశారు. శాటిలైట్ ఇంకా అవ్వలేదు. పాజిటీవ్ బజ్ వచ్చింది కాబట్టి రూ.3 నుంచి 4 కోట్ల వరకూ శాటిలైట్ పలుకుతుంది.
ఇక ఆశలన్నీ రీమేక్ రైట్స్ పైనే. ఓ పెద్ద హీరో పడుంటే ఈ సినిమా తుపాకీ రేంజ్లో ఆడేదని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళ, హిందీ సీమల నుంచి పెద్ద హీరోలు ఈ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. రీమేక్ అంటే ఈ రోజుల్లో రూ.3 – 4 కోట్లు తగ్గడం లేదు. ఈ విధంగా చాలా వరకూ రికవర్ చేసే వీలు…రీమేక్ రైట్స్ ద్వారా దక్కొచ్చు. మౌత్ పబ్లిసిటీ మెల్లమెల్లగా పెరిగి, థియేటర్‌కి జనాలొస్తే… రూ.25 కోట్లు రాబట్టడం కష్టమేం కాదు. ఏం జరుగుతుందో చూడాలి.