గరుడవేగ` సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రాజశేఖర్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో `గబ్బర్‌సింగ్` సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమాలో అంత్యాక్షరి సీన్లో రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ ఓ ఆర్టిస్ట్ చేసిన విషయం, దానిపై పవన్ కళ్యాణ్ సెటైర్ వేస్తూ “ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి” అంటూ రాజశేఖర్ స్టైల్లో మాట్లాడటం, అప్పట్లో ఆ సీన్ కి మెగా ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన రావడం తెలిసిందే. దీని గురించి రాజశేఖర్ స్పందించారు. `ఆ సీన్లో నటుడు అలీ కూడా ఉన్నారు. ఆయన నాకు చాలా క్లోజ్. ఆ సీన్ వద్దని పవన్‌కల్యాణ్‌కు అలీ చెప్పుండాల్సింది. లేదా ఆ సీన్ నుంచి తనను తప్పించమని అడిగుండాల్సింది. కానీ, ఆయన చేశారు. నాకు కొంచెం బాధనిపించింది. అలీగారిని కలిసినపుడు అడుగుదామనుకున్నాను. కానీ, అయిపోయిన దాని గురించి మళ్లీ అడగకూడదని ఊరుకున్నాన`ని రాజశేఖర్ చెప్పారు.
నిజానికి ఇప్పుడు తను చాలా మారానని, ఒకప్పటి లా కోపం, షార్ట్ టెంపర్ తనకి లేవని ఓపెన్ హార్ట్ లో ఆ మధ్య రాజశేఖరే స్వయంగా చెప్పాడు. ఆ మెచ్యూరిటీ ఆయన మాటల్లో కూడా కనిపిస్తోందని వ్యాఖ్యాత కూడా అన్నాడు. కానీ అంతకు ముందు రాజశేఖర్ ఇలా లేరు. జీవిత రాజశేఖర్ లు అప్పట్లో టివి లో వచ్చారంటేనే, మెగా ఫ్యాన్స్ గడ గడా వణికిపోయేవారు, వీళ్ళు మళ్ళీ ఏం కామెంట్స్ చేస్తారో ఏంటో అని. మొదట్లో వీరి చిరంజీవి పై వీరి విమర్శలు ప్రేక్షకులని ఆలోచింపజేశాయి కానీ ఆ తర్వాత సందర్భం ఉన్నా లేకపోయినా చిరంజీవి ని లాగి విమర్శించడం, చిరంజీవి పార్టీ పట్ల సానుకూల దృక్పథం లేని వాళ్ళకి కూడా వెగటు పుట్టించింది. బహుశా అందువల్లే గబ్బర్ సింగ్ లో పవన్ సెటైర్ వేసినపుడు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు.
సినిమాల ద్వారా వ్యక్తుల మీద సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. కానీ అది ఉట్టిగా ఉడుకుమోతుతనం తో చేసినట్టయితే ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వదు. ప్రేక్షకులకి కనెక్ట్ అయిందంటే అందులో ఎంతో కొంత విషయం ఉండకపోదు. ఇది రాజశేఖర్ కూడా కాస్త అర్థం చేసుకోవాలి. దీనికి మించి, ఆర్కే ఓపెన్ హర్ట్ ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్ ని స్వయంగా రాజశేఖరే నెగటివ్ సెన్స్ లో ఇమిటేట్ చేసాడు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో సందర్భం లో ఇమిటేట్ చేయడం బాధ కలిగించిందంటున్న రాజశేఖర్ తాను స్వయంగా పవన్ ని పేరుపెట్టి ప్రస్తావిస్తూ ఆయన మానసిక స్థితి గురించి వ్యాఖ్యలు చేస్తూ నెగటివ్ సెన్స్ లో ఆయన శైలి ని నడకని టివి ప్రోగ్రాం లో (ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే) కుర్చీ లో నుంచి లేచి మరీ ఇమిటేట్ చేసిన సంగతి ఆయన మరిచిపోయినా ఇదే యూట్యూబ్ లో ఆ వీడియో ఇప్పటికీ దర్శనమిస్తోంది. వేరే వాళ్ళు తనని ఇమిటేట్ చేస్తే తాను బాధ పడ్డపుడు తాను అలా ఇమిటేట్ చేసినపుడు వాళ్ళూ అలాగే బాధ పడతారనే లాజిక్ రాజశేఖర్ ఎలా మిస్సయ్యాడో.
గరుడవేగ లాంటి కొత్త తరహా కథతో సక్సెస్ సాధించి ఆనందం లో ఉన్న రాజశేఖర్ పై ఇప్పుడు అందరికీ మంచి సాఫ్ట్ కార్నరే ఉంది. మళ్ళీ ఎప్పటి పాత విషయాలో తట్టి లేపడం వల్ల ఆయనకి కొత్తగా వచ్చే సానుభూతి ఏమీ లేదు కానీ, కాస్తో కూస్తో చెడ్డ పేరు చేస్తుందనేది పరిశీలకుల ఉవాచ.