యాక్షన్ సీక్వెన్సులు తీయడానికి కొత్త కొత్త పద్ధతులు వచ్చినప్పటికీ, హీరోల భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ… కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి. డూప్ లేకుండా స్వయంగా తామే రిస్కీ షాట్స్ చేయాలని హీరోలు ముందుకు రావడమే ఇందుకు కారణం! యాంగ్రీ యంగ్‌మాన్, యాక్షన్ స్టార్ రాజశేఖర్‌కు కూడా రిస్కీ షాట్స్ చేయడం వలన గాయాలు అయ్యాయి. యూనిట్ సభ్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని కోరినా ఆయన వినడం లేదు. గాయాలను లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే… ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కల్కి’. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో బరువైన ఆయుధాలతో ఫైట్స్ తీస్తున్నప్పుడు రాజశేఖర్‌కి గాయలు అయ్యాయని తెలిసింది. విపరీతమైన నొప్పి కలగడంతో హాస్పిటల్‌కి వెళ్లారని చికిత్స తీసుకుని మళ్లీ వచ్చి షూటింగ్ చేశారట. దర్శకుడితో పాటు యూనిట్ సభ్యులు విశ్రాంతి తీసుకోమని కోరినా… తన వలన చిత్రీకరణకు అంతరాయం కలగకూడదని రాజశేఖర్ షూటింగులో పాల్గొంటున్నార్ట. నందితా శ్వేతా, అదా శర్మ, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు.