టాలీవుడ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పుకునే జంట రాజశేఖర్ – జీవిత. ఇద్దరిదీ ఒకటే మాట, ఒకటే బాట. రాజశేఖర్ లేనిదే జీవిత, జీవిత లేనిదే రాజశేఖర్ బయట కూడా కనిపించరు. రాజశేఖర్ బలం, బలగం అంతా.. జీవితనే. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. అయితే.. ఇద్దరి పరిచయం చిన్నపాటి గొడవతో, మిస్ అండర్ స్టాంగింగ్ తో మొదలైంది. బహుశా అలా మొదలైన పరిచయాలే స్ట్రాంగ్‌గా ఉంటాయేమో..? అసలింతకీ జీవిత, రాజశేఖర్ల తొలి పరిచయం ఎలా మొదలైంది? ఇద్దరి మధ్యా ఏం జరిగింది? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే…
‘హలో యార్ పేసరిన్’ అనే తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో హీరోగా రాజశేఖర్‌ని ఎంచుకున్నారు. జీవితని కథానాయికగా తీసుకున్నారు. అంతకు ముందు జీవిత, రాజశేఖర్‌లకు ఏమాత్రం పరిచయం లేదు. జీవితకు తమిళం బాగా వచ్చు. రాజశేఖర్‌కి మాత్రం ఆ భాష బొత్తిగా కొత్త. అందుకే.. రాజశేఖర్ తడబడుతూ డైలాగులు చెప్పేవాడు. జీవిత మాత్రం ప్రతీ షాటూ తొలి టేక్ లోనే ఓకే చేయించుకునేది. పేజీల కొద్దీ డైలాగుల్ని సులభంగా చెప్పేసేది. రాజశేఖర్ ఎంత బట్టీ పట్టినా… పది, పదిహేను టేకులు తీసుకోవాల్సిన పరిస్థితి. జీవిత ముందు తాను తేలిపోవడం.. రాజశేఖర్ కి ఏమాత్రం నచ్చడం లేదు. దాంతో తెలియకుండానే జీవితపై ఓ రకమైన అసూయ ఏర్పడింది. తొలి షెడ్యూల్ చివరి కరోజున దర్శకుడు రాజశేఖర్ దగ్గరకు వచ్చి… `హీరోయిన్ ఎలా చేస్తోంది?` అంటూ ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారు. `తను అస్సలు బాలేదు. హీరోయిన్ని మారిస్తే బెటర్…` అంటూ దర్శకుడికి సలహా పారేశాడు రాజశేఖర్. ‘సరే.. అలాగే చేద్దాం..’ అని వెళ్లిపోయాడా దర్శకుడు.
కట్ చేస్తే ఓ రోజు దర్శకుడి నుంచి రాజశేఖర్ కి ఫోనొచ్చింది. “మీరు చెప్పినట్టే మార్చేశాం.. హీరోయిన్ని కాదు.. హీరోనే. రేపటి నుంచి మీరు షూటింగ్‌కి రావాల్సిన అవసరం లేదు” అంటూ షాకిచ్చాడు. అలా తన తొలి తమిళ సినిమా అవకాశాన్ని జీవిత వల్ల కోల్పోవాల్సివచ్చింది.
కొన్నాళ్లకు తెలుగులో ‘తలంబ్రాలు’ అనే సినిమా మొదలైంది. రాజశేఖర్ హీరో. జీవిత హీరోయిన్. ‘హలో యార్ పేసరిన్’ ఇచ్చిన అనుభవంతో జీవిత దగ్గర చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు రాజశేఖర్. జీవితతో సీన్ అంటే.. ఆ రోజు రాజశేఖర్‌కి నిద్ర వచ్చేది కాదట. డైలాగులన్నీ బట్టీ పట్టి, ప్రాక్టీస్ చేసి.. ఆ సన్నివేశాన్ని ఏదోలా పాస్ చేయడానికి కష్టపడేవాడు రాజశేఖర్. ఓసారి దర్శకుడు కోడి రామకృష్ణ జీవిత దగ్గరకు వెళ్లి.. “రాజశేఖర్ ఎలా చేస్తున్నాడు.. ఓకేనా” అంటూ ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారు. జీవిత మాత్రం “ఆయన బాగానే చేస్తున్నారు” అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడంతో రాజశేఖర్ స్థానం నిలబడింది. ఈ విషయం తెలిశాక.. జీవితపై తొలిసారి అభిమానం ఏర్పడింది. తన మనసులోని అపోహలూ, అసూయలూ మెల్లమెల్లగా కనుమరుగయ్యాయి. ‘తలంబ్రాలు’ సూపర్ హిట్టయ్యింది. ఆ తరవాత.. జీవిత, రాజశేఖర్ వరుసగా నాలుగు సినిమాలు చేసేశారు. అలా.. స్నేహం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. ఆ తరవాత పెళ్లి చేసుకున్నారు. అదీ… జీవిత, రాజశేఖర్ ల లవ్ స్టోరీ. ఈ ఫ్లాష్ బ్యాక్‌ని రాజశేఖర్ మీడియా ముందు చాలాసార్లు పంచుకున్నారు కూడా.