`గరుడ వేగ` తో కాస్త ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఈ హిట్ ని కాపాడుకోవాలని, మళ్లీ నిలదొక్కుకోవాలన్నది రాజశేఖర్ తాపత్రయం. అందుకే… తదుపరి సినిమా విషయంలో ఏమాత్రం తొందర పడకుండా, జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. అందులో భాగంగా `అ`తో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ కథకి ఓకే చెప్పాడు. అదే.. `కల్కి`. టైటిల్ పరంగా, కాంబినేషన్ పరంగా ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. 1980 నేపథ్యంలో సాగే కథ అని చిత్రబృందం ప్రకటించడంతో… `మళ్లీ రాజశేఖర్ కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు` అనే నమ్మకం కలిగించింది. ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి కథానాయికల వేట సాగుతోంది. చాలామంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి ముగ్గుర్ని ఎంపిక చేశారు. నందితా శ్వేత, ఆదాశర్మలతో పాటు `బాహుబలి` ఐటెమ్ గాళ్‌గా పేరు తెచ్చుకున్న స్కార్లెట్ విల్సన్‌ని ఎంచుకున్నారు.
ఆదాశర్మ దాదాపుగా ఫేడవుట్ అయిపోయింది. ఆమె గురించి టాలీవుడ్ మర్చిపోయింది కూడా. చేసిన సినిమాలు కూడా ఫట్టే. ఇక నందితా శ్వేత `ఎక్కడికి పోతావు చిన్నవాడా`తో ఆకట్టుకుంది. అయితే ఆ తరవాత ఆమెకు మరో హిట్ దొరకలేదు. స్కార్లెట్ విల్సన్ కూడా `బాహుబలి` మినహాయిస్తే… ఆమెకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మరోటి లేదు. బహుశా ఇందులోనూ వ్యాంపు తరహా పాత్రే అయ్యుంటుంది. రాజశేఖర్ ఇప్పుడే కాస్త గాడిలో పడుతున్నాడు. ఈ దశలో ఇంకాస్త జాగ్రత్తగా అడగులు వేయాలి కూడా. ఫామ్‌లోని లేని హీరోయిన్లని, ఫేడవుట్ అయిపోయినవాళ్లనీ తీసుకుంటే ఎలా..?? సినిమాకి ఏమాత్రం క్రేజ్ రావాలన్నా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో రాజశేఖర్ జాగ్రత్తగా ఉండాలి. అన్నట్టు ఈ సినిమాకి రాజశేఖర్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. బహుశా.. బడ్జెట్ పరిమితుల వల్ల రాజశేఖర్ ఫేమ్ ఉన్న హీరోయిన్ల వైపు దృష్టి సారించలేదేమో..?!