రాజశేఖర్ ఇప్పుడు కమ్ బ్యాక్ ఇవ్వాలన్న ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఓవైపు కీలకమైన పాత్రలు ఒప్పుకొంటూనే, హీరోగా కథలు సిద్ధం చేసుకొంటున్నారు. రాజశేఖర్‌కు రిమేక్ చిత్రాలు బాగా అచ్చొచ్చాయి. అందుకే ఓ తమిళ కథ హక్కుల్ని రాజశేఖర్ సొంతం చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ యేడాది తమిళంలో విజయవంతమైన చిత్రాల్లో ‘లబ్బర్ పందు’ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో సాగే గ్రామీణ కథ ఇది. హరీష్ కల్యాణ్, జీతూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కుల్ని రాజశేఖర్ దక్కించుకొన్నట్టు సమాచారం. జీతూ పాత్రలో రాజశేఖర్ నటిస్తారు. హరీష్ కల్యాణ్ పాత్ర కోసం ఓ యంగ్ హీరో కావాలి. దాంతో పాటు రీమేక్ ని డీల్ చేయగలిగే సరైన దర్శకుడి కోసం వెదుకుతున్నారు.
రాజశేఖర్‌కు రీమేక్‌లు అచ్చొచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడంతా ఓటీటీ కాలం. రీమేక్‌లు చెల్లుబాటు కావడం లేదు. ఏ భాషలో ఏ మంచి సినిమా వచ్చినా సినీ అభిమానులు వెంటనే చూసేస్తున్నారు. ‘లబ్బర్ పందు’ కూడా అలానే చూశారు. ఓటీటీలో అందుబాటులో వుంది. అలాంటప్పుడు ఈ కథని రీమేక్ చేయడం సాహసమే. కథలోని ప్రధాన ఇతివృత్తం తీసుకొని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి, ఏదైనా ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ జోడిస్తే వర్కవుట్ అయ్యే ఛాన్సుంది. మరి రాజశేఖర్ ఏం చేస్తారో చూడాలి.