`నన్ను నిలబెట్టండి.. ఈ సినిమాని హిట్ చేయండి.. ఈ సినిమా పోతే.. అమ్ముకోవడానికి ఆస్తులు కూడా లేవు..` అంటూ దీనంగా వ్యాఖ్యలు చేశారు రాజశేఖర్. దాన్ని బట్టి `శేఖర్` సినిమాపై రాజశేఖర్, ఆయన కుటుంబం ఎంత ఆధార పడిందో అర్థమవుతూనే ఉంది. జోసెఫ్ కి రీమేక్ గా వచ్చిన సినిమా ఇది. జోసెఫ్ హిట్. దాన్ని ఎంత సాదా సీదాగా తీసినా… తెలుగులో వర్కవుట్ అవుతుందన్న భరోసా. దానికి తోడు… రాజశేఖర్‌కి రీమేకులు కలిసొచ్చాయి. దాంతో.. శేఖర్ ని బలంగా నమ్మారు. పెట్టుబడి పెట్టారు. తొలి రోజు `ఓకే` అనే టాక్ వచ్చింది. అయితే.. కోర్టు కేసులు.. ఈ సినిమాని నిలువునా ముంచేశాయి. గత సినిమాల భారం `శేఖర్`పై బలంగా పడింది. రూ.65 లక్షల డిపాజిట్ చెల్లించని కారణంగా ఈ సినిమాని నిలిపివేస్తూ.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీకెండ్ లో సినిమా లేకపోవడం.. శేఖర్ని `కిల్` చేసేసింది. ఇప్పుడు కోర్టు కెక్కి.. స్టే ఆర్డరుని వెనక్కి తెచ్చుకుని, సినిమాని కొనసాగించే టైమ్ లేదు. పైగా… సోమవారం నుంచి సినిమా థియేటర్లలో ఉన్నా, పెద్దగా ఫలితం లేదు. వచ్చేవారం.. `ఎఫ్ 3` వచ్చేవారం వచ్చేస్తోంది. ఇక ఆ సినిమా వస్తే… `శేఖర్`ని పట్టించుకునేవాళ్లే ఉండరు. ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వమని ముందు ఆఫర్లు వచ్చాయి. అప్పుడు అమ్ముకొన్నా… శేఖర్ గట్టెక్కేసేవాడు. ఇప్పుడు ఓటీటీ పోయింది.. థియేటర్ రిలీజ్‌కి వెళ్లినా, ఫలితం లేకుండా పోయింది.