రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. స్వచ్ఛంగా ఉంటాడు. అలానే మాట్లాడతాడు. మనసులో ఏముంటే అది బయటపెట్టేస్తాడు. నేనో సెలబ్రెటీ, నాకో స్టేటస్ ఉంటుంది.. ఇలానే మాట్లాడాలేమో – అనేవేం పట్టించుకోడు. ‘మా’ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజశేఖర్ మాట్లాడిన మాటలు, తన ప్రవర్తన మరోసారి ముచ్చటగొలిపేలా సాగాయి.
రాజశేఖర్ మాటకోసారి ‘జీవిత’ పేరు కలవరిస్తుంటాడు. ఈ విషయంపై కొంతమంది ఫ్యాన్స్ హర్టయ్యారట. ‘ఏంటి సార్ మీరు.. అస్తమానూ జీవిత జీవిత అంటారు మీ గురించి చెప్పుకోరా?’ అని ఆయన్నే అడిగేశార్ట.
”నేను జీవితని కట్నం తీసుకోకుండా పని చేశాను. ఈ అమ్మాయిని మొట్టమొదటిసారిగా ఓ రచయితని చేశాను. ఎడిటర్ని చేశాను. నిర్మాతని చేశాను. దర్శకురాలిని చేశాను. ఇదంతా చేసింది నేనే. జీవిత ఈజ్ గుడ్. వండర్ ఫుల్. గ్రేట్. కానీ జీవిత వెనుక నేనున్నాను..” అంటూ మరోసారి భార్యపై తనకున్న ప్రేమని వ్యక్తపరిచాడు.
‘మా’ ఎన్నికలలో నిలబడడం గురించి కూడా తనపై తాను సెటైర్లు వేసుకున్నాడు రాజశేఖరుడు.
”జీవిత, నరేష్ నిలబడుతున్నారు. నేను కూడా నిలబడనా? అని సినిమావాళ్లని అడిగాను. `వాళ్లని నిలబడమను.. నువ్వొద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. అసలు ఏమనుకుంటున్నారు నన్ను..? అనిపించింది. అందుకే నిలబడ్డా.
నిలబడిన తరవాత.. అందరూ నాతో నవ్వుతూనే మాట్లాడారు. ఇంత మంది నవ్వుతూ పలకరిస్తున్నారు కదా? గెలవడం చాలా ఈజీ అనుకున్నా. ఆ తరవాత…. నాకు పోటీగా శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి నిలబడ్డారని తెలిసింది. అప్పుడు నిజంగా చాలా భయపడ్డా. ఎందుకంటే శ్రీకాంత్ అందరితో కలసిపోతాడు. తనకో క్రికెట్ టీమ్ ఉంది. తప్పకుండా గెలుస్తాడు. ఓడిపోతే నేనేం చేయాలి? అనిపించింది. నామినేషన్ ఉపసంహరించుకుందామనుకున్నా. కానీ పోటీ చేయకతప్పలేదు. శ్రీకాంత్ నన్ను క్షమించు. ఓ వైపు షూటింగ్ కి డేట్లు ఇచ్చేశాను. అవి వదిలేసి ఎలక్షన్ అని పరిగెడితే.. ఉన్న పేరు మొత్తం పోతుంది. కానీ నన్ను గెలిపించారు. ఓడిపోతే పిచ్చివాడిలా తిరుగుండేవాడ్నేమో. గెలిపించారు థ్యాంక్యూ..” అంటూ ఈ ఎన్నికల ప్రహసనం, అందుకోసం తాను పడిన టెన్షన్ పూస గుచ్చినట్టు వివరించాడు.