బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి మరో కేసు నుంచి కూడా ఇవ్వాళ్ళ విముక్తి లభించింది. 1998లో రాజస్థాన్ లో ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు, కృష్ణ జింకలని వేటాడినందుకు ఆయనతో సహా మరో ఇద్దరిపై రెండు వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులో సల్మాన్ ఖాన్ వారం రోజులు జైల్లో కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఆ కేసు ఆయన మెడపై కత్తిలాగా వ్రేలాడుతూనే ఉంది. దానిపై విచారణ జరిపిన రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ జిత్ కౌర్ ఈరోజు తన తుది తీర్పు వెలువరిస్తూ సల్మాన్ ఖాన్ నిర్దోషని, ఆయనపై మోపబడిన అన్ని కేసులని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ నేరస్తుడని నిరూపించేందుకు సరైన సాక్ష్యాధారాలు లేనందునే కేసుని కొట్టివేస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషయితే కృష్ణ జింకలని ఎవరు చంపారు? అనే ప్రశ్నకి పోలీసులు, కానీ న్యాయస్థానం వద్ద గానీ సరైన సమాధానాలు లేవు. ఇదివరకు దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో బొంబాయి హైకోర్టు సల్మాన్ ఖాన్ని నిర్దోషిగా ప్రకటించి, ఆయనపై కేసులన్నీ ఎత్తివేసినప్పుడు కూడా సరిగా ఇటువంటి ప్రశ్నేఅందరూ అడిగారు.
సల్మాన్ ఖాన్ తప్పతాగి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి కారు నడిపినందునే నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి మరణించాడు. ఆ కేసు కూడా 14 ఏళ్ళు సాగిన తరువాత ముంబై ప్రత్యేక కోర్టు అయనని దోషిగా ప్రకటించి, ఐదేళ్ళు జైలు శిక్ష కూడా విదించింది. ఆ తీర్పు వెలువడే ముందు సల్మాన్ ఖాన్ తరపున వాదించిన న్యాయవాది, సల్మాన్ ఖాన్ సినీ పరిశ్రమకి, సమాజానికి చేస్తున్న సేవలని దృష్టిలో ఉంచుకొని తీర్పు చెప్పవలసిందిగా అభ్యర్ధించారు. అంటే, సల్మాన్ ఖాన్ తప్పు చేశారని ఒప్పుకొని, కనికరించమని కోర్టుని వేడుకొన్నట్లే స్పష్టం అయింది. ప్రత్యేక కోర్టు ఆయనని కనికరించలేదు కానీ హైకోర్టు మాత్రం కనికరించింది. ఎవరూ ఊహించని విధంగా, ఆఖరు నిమిషంలో బొంబాయి హైకోర్టు ఆయన నిర్దోషి అని ప్రకటించి, అన్ని కేసులు కొట్టివేసి విముక్తి ప్రసాదించింది. అప్పుడు కూడా, “మరి సల్మాన్ ఖాన్ కారు నడపకపోయుంటే దానిని ఎవరు నడిపారు? ఫుట్ పాత్ పై పడుకొన్నవారు ఎలాగ గాయపడ్డారు? వారిలో ఒకరు ఎలా మరణించాడు?” అని అందరూ ప్రశ్నించారు. 2015 సం.ముగింపు సమయంలో జవాబు దొరకని ప్రశ్నల జాబితాలో అదీ చేరింది. ఈ సం.లో ఈ ప్రశ్న చేరుతుందేమో?
ఈ రెండు కేసులలో కూడా సల్మాన్ ఖాన్ దోషి అని అందరికీ తెలిసినప్పటికీ డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటే, తిమ్మిని బమ్మి చేయవచ్చని ఇటువంటి తీర్పులు నిరూపిస్తున్నాయని ప్రజలు కూడా విమర్శిస్తున్నారు.