రాజన్… ఇలా చెబితే ఎవ్వరూ ఆయన్ని గుర్తు పట్టకపోవొచ్చు. కానీ `రాజన్ – నాగేంద్ర` అంటే.. ఓ తరం… స్వరాలాలాపనలో తేలిపోతుది. రాజ్ కోటి లా, శంకర్ ఎహ్సాన్ లాయ్ లా.. వీళ్లు కూడా జంట సంగీత దర్శకులే. ఒకప్పుడు తెలుగు సినిమా పాటమ్మ మెడలో మెలోడీ హారం వేశారిద్దరూ. ఒకటా రెండా..? ఎన్నో అద్భుతమైన గీతాలు. హాయైన బాణీలు. అలాంటి గొప్ప పాటలు అందించిన రాజన్ – నాగేంద్రలలో నాగేంద్ర 2000 సంవత్సరంలో పరమపదించారు. ఆదివారం రాత్రి రాజన్ కూడా.. తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని తన నివాసంలో రాజన్ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రాజన్ – నాగేంద్రదది మైసూర్ దగ్గరలోని ఓ పల్లెటూరు. తండ్రి రాజప్ప సంగీత విధ్వాంసుడు. ఆ లక్షణాలు సోదరులిద్దరికీ అబ్బాయి. 1952లో `సౌభాగ్యలక్ష్మి` సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో విఠలాచార్య సినిమాలకు పనిచేశారు. `పూజ`తో మంచి బ్రేక్ వచ్చింది. `పూజ`లో పాటలన్నీ హిట్టే. `ఎన్నెన్నో జన్మల బంధం – నీదీ నాదీ` పాట ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. నాగమల్లిలో టైటిల్ గీతం.. ఓ క్లాసిక్. `అగ్గి పిడుగు`లో `ఏమో ఏమో ఇది.. నాకేమో ఏమో అయినది` వీరిద్దరి ప్రావీణ్యానికి ఓ మచ్చుతునక. `నాలుగు స్థంభాలాల`లో `చినుకులా రాలి..`ని సంగీత ప్రియులు ఎప్పటికీ మర్చిపోరు. `ప్రేమ ఖైదీ`లో `నీ కళ్లలో స్నేహము..` కూడా మర్చిపోలేని మంచి మెలోడీనే. ఈ సోదరులిద్దరూ కలిసి దాదాపు 50 తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. తమిళ, కన్నడ, మలయాళం లెక్కిస్తే మరో యాభై వరకూ ఉంటాయి. తక్కువ సినిమాలు చేసినా – ఎన్నదగిన పాటల్ని అందించారు. స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే అవకాశం చాలా తక్కువ సార్లే వచ్చింది. ఎక్కువగా కొత్త హీరోలు, కొత్త దర్శకుల సినిమాలకు పనిచేశారు. అయినా తమదైన మార్క్ చూపించారు.