నుమాయిష్‌గా ప్రసిద్ధమైన హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీకి లీజు రద్దు చేసినట్టు అగ్ర శ్రేణి పత్రిక ఈనాడు మాత్రమే పెద్ద కథనం ఇచ్చింది. అది కూడా సమగ్రంగా సాధికారిక వార్తగానే ఇచ్చింది తప్ప సందేహాలకు చోటివ్వలేదు. అంతకు ముందు కాలంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కెటిఆర్‌లు లీజు పొడగింపుపై ఇచ్చిన హామీలు నేపథ్యం వంటివి కూడా ఈనాడు చాలా విశదంగానే ఇచ్చింది. బుధవారం టీవీ5 ప్యానల్లో మేము ఈ విషయం మాట్లాడినప్పుడు చర్చలో పాల్గొన్న శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకరరెడ్డి కూడా స్పష్టంగా మాట్లాడకపోవడాన్ని బట్టి సమాచారం లేదని భావించాం. అదే విషయం తెలుగు360లోనూ రాశాను. అయితే ఆ సొసైటీ చైర్మన్‌గా వున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ కథనాన్ని ఖండించడం ఆశ్చర్యం కలిగించింది. ఇవన్నీ గిట్టని వారి దుష్ప్రచారాలని ఆయన తోసిపుచ్చారు. 99 ఏళ్ల లీజు నిజాం వారసత్వం వంటి పాత కథలన్నీ పునరుద్ఘాటించారు. ఈనాడు కథనంలోనైతే లీజు రద్దుచేయడమే గాక స్థలం ఆర్అండ్బికి స్వాధీనం చేసినట్టు, వారు సొసైటీకి ఖాళీ చేయాల్సిందిగా నోటీసు ఇచ్చినట్టు కూడా వుంది. కేవలం వూహాగానమో లేక ఎవరో చెప్పిన కథనమోఅయితే ఇంత స్పష్టంగా రాస్తారా అన్నది ప్రశ్న. వార్త వచ్చాక విమర్శలను బట్టి వెనక్కు తగ్గారా లేక మంత్రి రాజేందర్ రాజకీయ జోక్యం చేసుకుని నిర్ణయం మార్పించారా తెలియదు. ఇదే విషయం ఈనాడులో మరో విధంగా వచ్చింది. లీజు రద్దు నోటీసు అందిన మాట నిజమేనని, కాని తాము మంత్రిని కలిసి మాట్లాడితే రెండు రోజుల్లో పరిష్కారం చేద్దామన్నారని సొసైటీ కార్యదర్శి చెప్పినట్టు అందులో వుంది. మంత్రి ప్రకటన నమస్తే తెలంగాణలో వచ్చింది.మరి ఇందులో ఏది ఎంతవరకు నిజం ఎవరు ఏమిటి ఎందుకు చెప్పారు తేల్చేదెవరు?