రాజేంద్రప్రసాద్ కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్నారా!? కొన్నాళ్ళు తండ్రీ కూతుళ్ళు మాట్లాడుకోలేదా!? ‘బేవర్స్’ ఆడియో ఫంక్షన్లో నటకిరీటి ఎమోషనల్ స్పీచ్ విన్నాక… అందరూ ఆశ్చర్యపోయారు. “నాకు ఒకే ఒక్క కూతురు. దాని పేరు గాయత్రి. దాంతో నేను మాట్లాడను. ఎందుకంటే… లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇవన్నీ మామూలు విషయాలే. అయితే… ‘బేవర్స్’లో సుద్దాల అశోక్ తేజ్ రాసిన ‘తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ’ పాట విని, నా కూతుర్ని ఇంటికి పిలిపించుకుని ఆ పాటను మనస్ఫూర్తిగా నాలుగుసార్లు వినిపించా” అని రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.
మీడియాలో ఆ ఎమోషనల్ స్పీచ్ చూసిన గాయత్రి తండ్రితో గొడవ పడ్డారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రాజేంద్రప్రసాదే చెప్పారు. “ఎమోషన్లో మా అమ్మాయి గురించి మాట్లాడేశా. కథాపరంగా మాట్లాడాల్సిన నేను వ్యక్తిగతంగా వెళ్లి అమ్మాయి గురించి చెప్పశా. అదంతా టీవీల్లో చూసిన గాయత్రి ‘మధ్యలో నా విషయం ఎందుకు చెప్పావ్?’ అంటూ గొడవ పెట్టేసింది. ఎమోషన్లో నోరు జారానని ఒప్పుకున్నా” అని రాజేంద్రప్రసాద్ అన్నారు. అదే సమయంలో మీ అమ్మాయిది ప్రేమ వివాహమా? అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఉంటే కన్నకూతురు ఎక్కడికో వెళ్లి వుండాలనీ, అమ్మాయి తనకు దగ్గరలోనే వుంటుందనీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియోకి అమ్మాయి, అల్లుడితో కలిసి హాజరయ్యానని ఆయన అన్నారు. ఇటీవల ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) వివాదాల గురించి స్పందిస్తూ “నేను వున్న కాలంలో ఎందుకు వివాదాలు ఎందుకు రాలేదని నేను ఆలోచించుకోవాలి. ఇప్పటివాళ్ళు తమ హయంలో ఎందుకు జరుగుతోందని ఆలోచించుకోవాలి. ఎవరైనా కనిపిస్తే.. ‘మన పరువు పోతుంది రా. అలా చేయకండి’ అని చెబుతా” అని రాజేంద్రప్రసాద్ అన్నారు.