ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు తీవ్ర అనారోగ్యానికి వైసీపీ సర్కార్ వేధింపులే కారణమా..? కేసుల పేరిట వేధించడంతోనే ఆయన ఆరోగ్యం విషమించిందా..? అందుకు వైసీపీ ప్రతిఫలం అనుభవిస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
మార్గదర్శి కేసు విషయంలో రామోజీ రావును జగన్ సర్కార్ నానా రకాలుగా వేధించింది. ఆయన అనారోగ్యంతో ఉన్నారని తెలిసినా… అరెస్ట్ భయంతోనే కుంటిసాకులు చెబుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. తెలుగు నేలలో ఓ శిఖరంగా ఎదిగిన ఆయనకు అవినీతి మకిలి అంటించాలని ప్రయత్నించారు కానీ, అవేవి ఫలించలేదు.
పైగా ఎనభై ఏళ్ల వయస్సున్న రామోజీ రావు విషయంలో వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలపై విమర్శలు రావడంతో కొంత వెనక్కి తగ్గారు. అయితే ఆయన పట్ల వైసీపీ వ్యవహరించిన తీరుతో రామోజీరావు మానసికంగా క్షోభకు గురై తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెత్త రాజకీయాల వలనే రామోజీరావు చివరి రోజుల్లో మానసికంగా క్షోభకు గురయ్యారని… రామోజీ రావుని టార్గెట్ చేయడం దేవుడు కూడా సహించలేదని అందుకే నిజాన్ని గెలిపించాడన్నారు. ఘన విజయాన్ని రామోజీరావు చూసి వెళ్ళారని, ఆయన అనుకున్నది సాధించారని వ్యాఖ్యానించారు. మార్గదర్శి కేసు విషయంలో రామోజీరావును జగన్ సర్కార్ వెంటాడంతోనే ఆయన మానసికంగా కుంగిపోయారని.. అదే ఆయనను తీవ్ర అనారోగ్యానికి గురయ్యేలా చేసిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పకనే చెప్పారు.
రామోజీ రావు మరణంతో వైసీపీ ఆయన పట్ల గతంలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతుండగా.. రాజేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.