తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య వార్తల్లో కనిపించడం లేదు. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలసి తనది ఒకే మాట, రాజకీయంగా తమది ఒకే బాట అన్నట్టుగా ఉండేవారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ లో తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించినా స్పీకర్ పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నేతలు పోరాటం చేస్తున్నారు. ఇదే అంశమై మొన్ననే స్పీకర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. పార్టీ భేటీల్లో కూడా ఇదే ప్రధాన అజెండాగా ఉంటోంది. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి, ఏఐసీసీ ఈ తరఫున రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామనీ అంటున్నారు. ఇద్దరి సభ్యత్వాల రద్దు వ్యవహారమే ప్రధానాస్త్రంగా చేసుకుని కేసీఆర్ పై టి. కాంగ్రెస్ నేతలంతా పోరాటం చేస్తున్నారు. కానీ, ఈ పోరాటంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనిపించడం లేదు. పార్టీ మీద ఏదైనా అసంతృప్తి ఉన్నా, సొంత సోదరుడి వ్యవహారంపై కూడా ఆయన స్పందించకపోవడమే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో చర్చనీయం అవుతోంది.
అంతేకాదు, ఈ మధ్య జరిగిన సీఎల్పీ భేటీలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ఎందుకు రావడం లేదనే సమాచారం కూడా ఆయన ఇవ్వడం లేదట! పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తో రాజగోపాల్ కి ఈ మధ్య పడటం లేదన్న ఆరోపణలున్నాయి. ఉత్తమ్ పనితీరుపై కొద్దిరోజుల కిందట మీడియా ముందే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇంకోపక్క అన్న వెంకట్ రెడ్డి మాత్రం ఉత్తమ్ తో సయోధ్యగా ఉంటున్నారు. ఈ పరిస్థితే ఆయనకు నచ్చలేదని సమాచారం. దీంతో పార్టీ కార్యక్రమాలతోపాటు, సొంత అన్న వ్యవహారంపై పీసీసీ జరుగుతున్న సమావేశాలకు ఆయన రావడం మానేశారని సమాచారం.
ఉత్తమ్ కీ రాజగోపాల్ రెడ్డి మధ్య కొన్ని విభేదాలకు కారణమూ లేకపోలేదు! వచ్చే ఎన్నికల్లో సొంత జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో తాను సూచిస్తున్న వ్యక్తులకే సీట్లు ఇవ్వాలనీ, తాను ప్రతిపాదించిన వారినే నియోజక వర్గ ఇన్ ఛార్జులుగా నియమించాలని రాజగోపాల్ పట్టుబడుతున్నారట. ఈ ప్రతిపాదనలను ఉత్తమ్ పట్టించుకోవడం లేదనీ, ఎవర్ని ఎక్కడ నియమించాలో పార్టీ చూసుకుంటుందనీ సిఫార్సులకు ఆస్కారం ఉండదన్నట్టు ఆయన వ్యాఖ్యానించారట. దీంతో ఈ ఇద్దరి మధ్యా కొంత గ్యాప్ పెరిగిందని సమాచారం. అందుకే, సొంత అన్న సభ్యత్వ వ్యవహారంపై పోరాటం జరుగుతున్నా కూడా రాజగోపాల్ దూరంగా ఉంటున్నారని అంటున్నారు. మరి, ఈ విషయంలో తనకు తోడుగా రావాలని సోదరుడిని వెంకట్ రెడ్డి కోరారా లేదా అనేదీ ప్రశ్నే..?