‘ది ఫ్యామిలీమెన్ 2’ సిరీస్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది సమంత. ఇందులో రాజీ పాత్ర గురించి చర్చ జరుగుతోంది. సమంత వన్ వుమెన్ షో.. అంటూ.. ఈ వెబ్ సిరీస్ ని అభివర్ణిస్తున్నారంతా. అత్యంత సహజమైన రీతిలో సమంత తన నటన ప్రదర్శించింది. ఈ రాజీ పాత్రని కొనసాగించాలని `ఫ్యామిలీ మెన్` సృష్టికర్తలు.. రాజ్ – డీకే భావిస్తున్నట్టు సమాచారం. రాజీ ఫ్లాష్ బ్యాక్ తో… ఈ కథ నడుస్తుంది. రాజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె గతం ఏమిటన్నది `ది ఫ్యామిలీమెన్ 2`లో చూపించలేదు. కేవలం కొన్ని సంభాషణలతో పరిమితం చేశారంతే. అందుకే ఆ పాత్రని కేంద్ర బిందువుగా చూపిస్తూ.. కథని నడపాలని భావిస్తున్నార్ట. అయితే… ఈసారి మాత్రం వెబ్ సిరీస్ కోసం కాదు. సినిమానే తీస్తార్ట. అందుకోసం ముందే సమంతతో సంప్రదింపులు జరిపేశారని, `ఫ్యామిలీమెన్ 2` కథ చెబుతున్నప్పుడే.. రాజీ పాత్రతో ఓ సినిమా చేస్తామని సమంతకు మాటిచ్చారని తెలుస్తోంది. ఇది వరకు `బేబీ` విషయంలోనూ ఇలానే జరిగింది. అందులోని తాప్సి పాత్రని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని `నామ్ షబానా` అనే సినిమా తీశారు. ఓరకంగా అది `బేబీ`కి ప్రీక్వెల్. సో.. `రాజీ` ని `ది ఫ్యామిలీమెన్ 2`కి ప్రీక్వెల్ అనుకోవొచ్చన్నమాట. ఈ సినిమాని ఓటీటీ కే పరిమితం చేస్తారా? థియేటరికల్ రిలీజ్ కూడా ఉంటుందా? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాలి.