రజనీకాంత్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. గత కొంతకాలంగా రజనీ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈమద్య రజనీ ఆరోగ్యం కాస్త కంగారుపెట్టడంతో అమెరికాలో ఆయన విశ్రాంతి తీసుకొన్నారు. ఈలోగా రజనీ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వ్యాపించాయి. రజనీ కిడ్నీలు పాడయ్యాయని, కిడ్నీ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిందని చెప్పుకొన్నారు. ఈ విషయంపై రజనీ సన్నిహితులు ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. కబాలి విడుదల తేదీ దగ్గర పడుతున్నా రజనీ రాకపోవడం చూసి ఆ కంగారు మరింత ఎక్కువైంది. అయితే ఎట్టకేలకు సూపర్ స్టార్ తిరిగొస్తున్నాడు. ఈనెల 20న రజనీకాంత్ అమెరికా నుంచి చెన్నై తిరిగొస్తున్నాడని తెలుస్తోంది.
రజనీ వచ్చినా కబాలి ప్రమోషన్లకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. కనీసం రజనీ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకొంటారని ఆ తరవాతే రోబో 2.0 చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. అయితే ఈలోగా.. రజనీ తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చే అవకాశం ఉంది. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లకు ఆయన వివరణ ఇచ్చుకొంటారని తెలుస్తోంది. రజనీ ఆరోగ్యం విషయంలో పుకార్లు రేగి, ఆయన అభిమానులు కంగారు పడుతున్న నేపథ్యంలో రజనీ ఈ అనుమానాల్ని పటాపంచలు చేసే అవకాశం ఉంది. మరి కబాలి విడుదలకు ముందే ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే కబాలి విడుదలయ్యాక రజనీ మీడియా ముందుకు వస్తారా, లేదంటే ట్విట్టర్లోనే ఏమైనా సందేశం ఇస్తారా అన్నది చూడాలి.