సినిమా ఇండస్ట్రీ, సెంటిమెంట్ కవలల్లాంటివి. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒక సినిమా ఒక ఫార్ములాలో సక్సెస్ అయితే.. ఇక మిగిలిన వారంతా అదే ఫార్ములా పట్టుకుంటారు. ఒక సినిమాలో హీరోకి ముద్దు సీన్ ఉంటే ఆ మూవీ హిట్ అవుతుందనుకుంటే.. ఇక అందరూ అదే బాట పడతారు. అప్పుడెప్పుడో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వస్తే.. ఆ తర్వాత వరుసగా అవే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హారర్ కామెడీ హిట్ కొట్టగానే.. అవే కథలు పుట్టుకొస్తున్నాయి. అయితే.. ఇలాంటి సెంటిమెంట్స్ ను బ్రేక్ చేశారు ఇద్దరు.
తెలుగులో రజనీకాంత్ సాధించిన సక్సెస్ ని టాలీవుడ్ లో తారక్ సాధించాడు. అంత గొప్ప ఘనత ఏంటనుకుంటున్నారా? అదే గడ్డం కథ. హీరో గడ్డంతో కనిపిస్తే.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందనే ముద్ర చాన్నాళ్లుగా ఉంది. అయితే ఆ సెంటిమెంట్ ను అప్పట్లో రజనీకాంత్ బ్రేక్ చేశాడు. బాషా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత చాలా మంది తలైవాని ఫాలో అయ్యారు. అజిత్, ఇతర హీరోలు గడ్డంతో హిట్ కొట్టారు.
ఇక తెలుగులో కూడా ఈ సెంటిమెంట్ బలంగా ఉంది. తమిళ తంబీల కంటే మన దగ్గరే ఇది ఎక్కువ. మెగా ఫ్యామిలీ హీరోల్లో చిరంజీవి బిగ్ బాస్ లో గడ్డంతో నటించాడు. అది డిజాస్టర్ అయింది. పవన్ కల్యాణ్ పంజాలో యాక్ట్ చేశాడు. అదీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక నందమూరి ఫ్యామిలీలో బాబాయ్ బాలయ్య కూడా అధినాయకుడులో గడ్డంతో నటించాడు. అది కూడా ఫ్లాప్ ఖాతాలో చేరిపోయింది. (లెజెండ్ లో గడ్డం చాలా ట్రిమ్ గా ఉంటుంది). వెంకటేశ్ – షాడో, కమల్ హాసన్ – ఈనాడు సినిమాలు కూడా ప్రేక్షకులని మెప్పించలేపోయాయి..
దీంతో గడ్డం సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. అయితే ఈ సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేసినట్టే కనిపిస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమాలో తన స్టైలిష్ గడ్డం కూడా సినిమాను గట్టెక్కించడంలో కీ రోల్ ప్లే చేసిందంటున్నారు. అందుకే తమిళ్ లో తలైవా, తెలుగులో తారక్ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారని టాక్ నడుస్తోంది.