హైదరాబాద్: సూపర్‌స్టార్ రజనీ కాంత్ తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. తన తాజా చిత్రం ‘కపాలి’ని నాటి సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘బాషా’తో పోల్చొద్దని కోరారు. కపాలి బాషాలాగా ఉంటుందా అని ఇటీవల చాలామంది తనను అడుగుతున్నారని చెప్పారు. బాషాను అధిగమించే చిత్రం చేయగలనో, లేదో తనకే తెలియదని అన్నారు. బాషా చిత్ర నిర్మాత, తమిళనాడు రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు ఆర్ఎమ్ వీరప్పన్ జన్మదిన కార్యక్రమానికి నిన్న రజనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాషా 125 రోజుల వేడుకలో ప్రసంగిస్తూ తమిళనాడులో బాంబుల సంస్కృతి పెరిగిపోయిందని తాను వ్యాఖ్యానించానని, ఆ వెంటనే వీరప్పన్ మంత్రిపదవి పోయిందని గుర్తు చేసుకున్నారు. దీనిపై తాను బాధను వ్యక్తం చేయగా, అదంతా భగవంతుడి లీల అని వీరప్పన్ అన్నారని రజనీ చెప్పారు. ఇక కపాలి విషయానికొస్తే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 17 న చెన్నైలో ప్రారంభం కానుంది. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ రూపొందిస్తున్నారు.