రజనీకాంత్ కెరీర్లో ఎన్నో ఫ్లాపులు ఉన్నాయి. అయితే ‘బాబా’ మాత్రం మర్చిపోలేని పరాజయం. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఇది. ఈ చిత్రానికి రజనీ నిర్మాతగా వ్యవహరించడమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే అందించాడు. రజనీపై నమ్మకంతో ఈ సినిమాని అప్పట్లో భారీ రేట్లకు కొన్నారు బయ్యర్లు. చివరికి ‘బాబా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రజనీ తమకు నష్టపరిహారం చెల్లించాలని బయ్యర్లు గొడవకు కూడా దిగారు. కానీ రజనీ చిల్లి గవ్వ కూడా తిరిగి ఇవ్వలేదు. ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ రజనీని దెప్పి పొడుస్తుంటారక్కడ.
ఇప్పుడు ‘బాబా’ ప్రస్తావన ఎందుకంటే – రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ అనే చిత్రం తెరకెక్కింది. దీన్ని లైకా సంస్థ నిర్మించింది. నిజానికి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలెవరూ ధైర్యం చేయలేదట. ‘మీ నాన్నగారే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా’ అంటూ ఐశ్వర్యకు సలహాలు ఇచ్చార్ట. కానీ `బాబా` ఫలితంతో మరెప్పుడూ నిర్మాతగా సినిమా తీయకూడదని రజనీ నిర్ణయించుకొన్నాడట. ఈ విషయాన్ని రజనీనే స్వయంగా వెల్లడించారు. ”బాబా తరవాత మళ్లీ నిర్మాణ రంగం వైపు వెళ్లకూడదనుకొన్నా. అందుకే ఐశ్వర్య సినిమాకు నేను నిర్మాతగా ఉండలేకపోయా” అని ‘లాల్ సలామ్’ వేడుకలో వెల్లడించారు రజనీ. ఆ సినిమా రజనీని అంతలా భయపెట్టింది మరి. సినిమా ఫ్లాప్ అయినా రజనీ కోల్పోయింది ఏమీ లేదని, మంచి రేట్లకు సినిమాని అమ్ముకొని లాభపడ్డారని, నష్టపోయింది బయ్యర్లే అని రజనీ యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు పాత లెక్కలు బయటకు తీస్తున్నారు. ‘బాబా’ ఫ్లాప్ అయినప్పుడు బయ్యర్లకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తే ఈ మచ్చ అప్పుడే తొలగిపోయేది.