ఈ సంక్రాంతికి మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లకు పోటీగా ఓ తమిళ సినిమా వస్తోంది. డబ్బింగ్ బొమ్మే అయినా – మన స్టార్ హీరోలలకు సైతం వణుకు పుట్టించే సినిమా అది. అదే… దర్బార్. జనవరి 9న విడుదల కాబోతోంది. అంటే ఈ సంక్రాంతికి బరిలోకి దిగే మొదటి పుంజు రజనీకాంతే. ఈ సినిమాపై రజనీ చాలా నమ్మకంగా ఉన్నాడు. మురుగదాస్ స్క్రీన్ ప్లేతో కనికట్టు చేశాడని, అసలు ఈ సినిమాలోనే ఓ మ్యాజిక్ జరిగిందని చెప్పుకొచ్చాడు రజీనీ. కాసేపటి క్రితం హైదరాబాద్‌లో ‘దర్బార్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ “అందరూ సినిమా బాగా హిట్ కావాలనే చేస్తారు. అయితే సినిమా చేసే సమయంలో ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ మన చేతుల్లో ఉండదు. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకు జరిగింది. మురుగదాస్‌గారితో పనిచేయాలని 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది. ఈ కథను వింటే హీరో, నిర్మాత ఎలా చేశారీ సినిమాను అనుకుంటారు. కానీ మురుగదాస్‌గారు ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు రజనీ.
తన ఎనర్జీ సీక్రెట్ గురించి పంచుకుంటూ “ఇంత వయసులోనూ ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారని కొంత మంది అడుగుతుంటారు. తక్కువగా ఆశపడండి. తక్కవగా బాధపడండి.. తక్కువగా భోజనం చేయండి.. తక్కువగా నిద్ర పోండి.. తక్కువగా ఎక్సర్సైజ్ చేయండి, తక్కువగా మాట్లాడండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం” అంటూ ఆ రహస్యాన్నీ బయట పెట్టేశాడు.