ఎట్టకేలకు కొంత సస్పెన్స్ వీడింది! రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ ప్రకటన చేశారు. వరుసగా ఐదు రోజులపాటు ఆయన అభిమానులతో భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. చివరిగా.. తాను వస్తున్నా అంటూ రజనీ ప్రకటించేసరికి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని సూపర్ స్టార్ చెప్పారు. ఈ సందర్భం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం పనిచేసేవాళ్లు రాజకీయాల్లో ఉండకూదనీ, ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలన్నారు. కుల, మత, జాతి, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలన్నారు. తమిళనాడులో రాజకీయాలు తలవంపులుగా ఉన్నాయనీ, ప్రజాస్వామ్యం బలహీనపడుతోందన్నారు. గడచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తమిళనాడు పేరు చెడగొడుతున్నాయి అన్నారు. తనకు డబ్బూ పేరు ఉన్నాయనీ, వాటికోసం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. రాజకీయాల్లోకి రావడం ఇదే సరైన తరుణమనీ, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ ప్రారంభిస్తాననీ, అంతవరకూ దీని గురించి ఎవ్వరూ మాట్లాడవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసి తన ప్రసంగాన్ని ముగించారు.
దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర తీసినట్టయింది. నిజానికి, తాను వస్తున్నట్టు మాత్రమే రజనీ ప్రకటించారు. పార్టీయేంటో విధి విధానాలేంటో కార్యాచరణ ఎప్పటి నుంచో అనే స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. రజనీ ప్రకటన అనంతరం మరో నటుడు కమల్ హాసన్ స్పందించారు. రజనీకాంత్ కి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించి… రజనీ రాజకీయాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తమిళ రాజకీయ ప్రముఖులు కూడా రజనీ ఎంట్రీపై స్పందించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందిస్తూ.. రజనీని రాజకీయాల్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఇటీవలే జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన దినకరన్ కూడా రజనీ రాకపై సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ ని రాజకీయాల్లో చూడటం ఆనందంగా ఉందన్నారు.
ఇక, భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందన కాస్త తీవ్రంగానే ఉండటం విశేషం. రజనీకాంత్ చదువూ సంధ్యాలేని వ్యక్తి అనీ, అలాంటివారు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారంటూ విమర్శించారు. తమిళనాడు రాజకీయాల నుంచి సినీతారలను వెలేస్తే తప్ప, వారి ప్రతిష్ట పెరిగే అవకాశం లేదని ఆయన మండిపడ్డారు. ఇలా అంటూనే తమిళ ప్రజలు తెలివైనవారు అంటూ సుబ్రహ్మణ్య స్వామి ముక్తాయించడం విశేషం.