నరేంద్రమోదీకి సన్నిహితుడిగా, బీజేపీ అనుకూలుడిగా గుర్తింపు ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్.. భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్టుగా బీజేపీ ప్రమోదకరమైన పార్టీయేనేమోనని అన్నారు. అంతే కాకుండా నోట్ల రద్దు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని రజనీకాంత్ సమర్థించారు. ఇది సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశమని, ఈ విషయంపై ఒక్క మాటలో సమాధానం చెప్పటం కష్టమని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని భావించడం వల్లే విపక్షాలు కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయని రజినీకాంత్ అన్నారు. బీజేపీపై రజినీ ఇలా స్పందించడంతో తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయనకు మద్దతుగా ఉంటూ వస్తున్న రజనీకాంత్ ఉన్నట్టుండి ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలేంటనే చర్చ విస్తృతమైంది. డిసెంబర్ ఇరవై రెండో తేదీన.. రజనీకాంత్ పార్టీని ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో… బీజేపీ అనుకూల ముద్ర పడితే.. మొత్తానికే మోసం వస్తుందన్న భావనలో ఆయన ప్లేటు ఫిరాయించారని చెబుతున్నారు.
కానీ రజనీంత్ వ్యవహారశైలి గురించి తెలిసిన వాళ్లు మాత్రం.. రేపు మోడీని పొగిడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇటీవల స్టెరిలైట్ పరిశ్రమ కాల్పుల వ్యవహారంలోనూ.. ఆయన అన్నాడీఎంకేకు.. కేంద్రానికి మద్దతుగా మాట్లాడారు. బాధితుల ఆగ్రహానికి గురయ్యారు. ఆయనప్పటికీ.. ఆయన విధానాన్ని మార్చుకోలేదు. మరో సూపర్ స్టార్ కమలహాసన్ మాత్రం.. చాలా తీవ్రంగా.. మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కోణంలోనే తనపై ప్రో మోడీ ముద్ర పడితే… తమిళ ప్రజలు ఆదరించరనే భయంతో రజనీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది.