పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అనే సామెత చాలా సందర్భాల్లో మనకు అచ్చుగుద్దినట్టుగా అప్లై అవుతుంది. ఇప్పటి సినిమా హీరోల తీరు అలానే ఉంది. గతంలో ఎవరెవరో ముఖ్యమంత్రులు అయిపోయారని, సినిమాలలో నటించే వయసు దాటిపోతోందని, హిట్స్ కొట్టే సామర్థ్యం ఇంకా ఎంతో కాలం లేదని చెప్పి పొలిటికల్ తెరంగేట్రం చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళ ధైర్యం, తెలివితేటలు చూస్తుంటే అదృష్టం కూడా బాగా కలిసొచ్చి సూపర్ స్టార్స్ అయ్యారా అన్న అనుమానం వస్తుంది.
ఎన్టీఆర్ కూడా ఎంజీఆర్‌ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా శషబిషలు లేవు. సందేహాస్పద నిర్ణయాలు లేవు. ఓడిపోతే ఏమవుతుందో అన్న భయం లేదు. దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను…..ఇంకా చెప్పాలంటే ప్రపంచాధినేతలను కూడా గడగడలాడించిన ఇందిరాగాంధీతో పోరాడి గెలవగలమా అన్న అనుమానం అస్సలు లేదు. ప్రత్యర్థి రాజకీయ నాయకులను ఊచలు లెక్క పెట్టేలా చేయడంలో ఇందిరాగాంధీకి మహా గొప్ప రికార్డ్ ఉంది. ఇప్పటి వరకూ భారతదేశం చూసిన అతి గొప్ప నియంతృత్వ మనస్తత్వం ఉన్న నాయకురాలు ఇందిరాగాంధీ.
అయితేనేం రంగంలోకి దిగింది ఎన్టీఆర్. నిలబడ్డాడు, పోరాడాడు, గెలిచాడు. అది కూడా ఊరూ పేరు తెలియని యువకులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అప్పటివరకూ అప్రతిహతంగా అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్‌ని పాతాళానికి పడేశాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎవరో పిలుస్తున్నారనో, దేవుడు ఆదేశిస్తే అనేలా రంగంలోకి దిగకముందే ఫెయిల్యూర్ భయంతో జాగ్రత్తగా మాట్లాడడంలాంటివి ఎన్టీఆర్‌కి అస్సలు చేతకాదు. అంతా కూడా మొండి ధైర్యం, గుడ్డి నమ్మకం, ముక్కుసూటితనం….ఏం చేసినా రాజసంగా చేయడం ఎన్టీఆర్ అలవాటు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం అలాంటిది కనుకే వెన్నుపోటు పొడవగలిగారు. అది వేరే విషయం అనుకోండి.
ఇక చిరంజీవి, రజినీకాంత్‌ల వ్యవహారం అంతా ఎన్టీఆర్‌కి పూర్తి వ్యతిరేకం. చిరంజీవికి రాజకీయాల్లో రాణించేంత గట్స్ లేవని విజయశాంతి ఎప్పుడో చెప్పింది. ఇక రజినీ విషయంలో ఖుష్బూది కూడా అదే డైలాగ్. చిరు, రజినీల వ్యవహారం కూడా అలానే ఉంటుంది. నిజంగా రాజకీయాల్లోకి వచ్చే ఉద్ధేశ్యమే లేకపోతే రాజకీయ రంగప్రవేశం గురించి హింట్స్ ఇచ్చేలా సినిమాల్లో డైలాగులు ఎందుకు? రావాలని ఉంటుంది. కానీ భయం కూడా ఉంటుంది. ఓడిపోతే నెపం ఎవరిమీద వేయాలా అని ముందుగానే ప్లాన్ చేసుకుని దిగుతున్నారా అన్న అనుమానం వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి వ్యవహార శైలి చూస్తూ ఉంటే. చిరంజీవినేమో జనాలు పిలిస్తే వచ్చానంటాడు. మరి అదే జనాలు సొంత ఊర్లోనే ఎమ్మెల్యేగా నిలబడ్డ చిరంజీవిని ఎందుకు ఓడించారు. ఇక రజినీకాంత్ వ్యవహారం మరీ ఘోరం. దేవుడు ఆదేశిస్తే వస్తాడట. వస్తే అవినీతిని రూపుమాపేస్తా అన్న పంచ్ డైలాగ్ ఒక్కటి. రేపెప్పుడో కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం అని అనుకున్న తర్వాత రాత్రి దేవుడు కలలో చెప్పాడు……అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చా అంటాడా? ఫలితం తేడా వేస్తే అంతా దేవుడే చేశాడు అని దేవుడిని నిందిస్తాడా? అయినా రజినీకాంత్‌ని రాజకీయ రంగప్రవేశం చెయ్యమని ఆదేశించాల్సిన అవసరం దేవుడికి ఏంటో?