రాజకీయాల్లోకి వస్తా.. వస్తా అని చెప్పి చివరికి ఫ్యాన్స్ కి హ్యాండిచ్చారు రజనీకాంత్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందే.. అభిమానులకు `సారీ` చెప్పి తప్పుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రజనీ పొలిటికల్ రీ ఎంట్రీ గురించిన వార్తలొస్తున్నాయి. రజనీకాంత్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని, రాజకీయాల్లోకి వస్తారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దానితో పాటుగా.. ఈరోజు తమిళనాడులోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ తన అభిమాన సంఘంతో కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఇదంతా రజనీ రాజకీయ అరంగేట్రం కోసమే అని ప్రచారం జరిగింది. అందరి దృష్టీ ఈనాటి సమావేశంపై ఫోకస్ అయ్యింది.
అయితే ఇప్పుడు రాజకీయాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్. తను రాజకీయాల్లోకి రానని, భవిష్యత్తులో కూడా ఇటువైపు అడుగుపెట్టనని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు.. తన పార్టీ మక్కల్ మండ్రంని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక మీదట తన అభిమాన సంఘాల పేరుతోనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు రజనీకాంత్. తన ఆరోగ్యం బాగోకపోవడంతో ఇటీవల అమెరికా వెళ్లొచ్చారు రజనీ.