సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. ఆయనకు ఉన్న సూపర్ స్టారిజం.. సింప్లిసిటీ.. ఆయన వ్యవహారశైలి.. ప్రజాదరణ రీత్యా .. ఇది సముచితమైన పురస్కారం. అందులో సందేహం లేదు. కానీ ఓ లెజెండ్‌కు గుర్తింపు ఇచ్చే ప్రక్రియలో రాజకీయ లాభాలు చూసుకోవడమే ఇక్కడ విమర్శలకు కారణం అవుతోంది. ఆయనకు పురస్కారం వస్తే ఆయన గొప్పదనం గురించి చర్చ జరగాలి కానీ.. ఆయనకు ఏ ఉద్దేశంతో పురస్కారం ఇచ్చారో అన్నదానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇది ఓ లెజెండ్‌ను అవమానించడమే . ఈ పరిస్థితిని తీసుకొచ్చి ఘనత వహించింది కేంద్రమే.
రజనీకాంత్‌కు దాదాసాహెబ్ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి జవదేకర్ ప్రకటించిన వెంటనే.. రజనీకాంత్‌కు అభినందనలు వెల్లువెత్తలేదు. తమిళనాడు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు.. రజనీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసి… వారి ఓట్లు పొందేందుకు ఆడిన చీప్ డ్రామాగా అందరూ విమర్శించడం ప్రారంభించారు. దీంతో రజనీ గొప్పతనం పక్కకు పోయింది. రాజకీయం ముందుకు వచ్చింది. రజనీకాంత్ లెజెండే కానీ.. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించడం ప్రారంభించారు. గతంలో బీజేపీ సర్కార్ కొన్ని భారత రత్న పురస్కారాలు ప్రకటించినప్పుడు కూడా ఇదే ఫార్ములా చూసుకుందని.. అప్పుడు వర్కవుట్ అవడంతో ఇప్పుడు.. తమిళనాడులోనూ రజనీ ఫ్యాన్స్‌పై దృష్టి పెట్టిందని అంటున్నారు.
రజనీకాంత్ సినిమాల పరంగా తిరుగులేని వ్యక్తి. భారత దేశ సూపర్ స్టార్లలో ఆయనదో విలక్షణ శైలి. రజనీకి.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు సముచితమే. కానీ ఇవ్వాల్సిన పద్దతిలో ఇవ్వడం కూడా ముఖ్యం. ఇప్పుడు ఆయనకు ఇచ్చిన అవార్డు రాజకీయ అవసరాల కోసం ఇచ్చినట్లుగా ఉంది కానీ… నిజంగా ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఇచ్చినట్లుగా లేదు. దేశంలో ప్రతీ దానిలోనూ రాజకీయం కనిపిస్తోంది. స్వచ్చంగా ఉంచాల్సిన అంశాల్లోనూ ఇలా రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం వల్ల.. వాటి విలువ తగ్గుతుంది. వాటిని అందుకునేవారికీ ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిస్థితి మారినప్పుడే.. అవార్డులకు మరింత విలువ పెరుగుతుంది. లేకపోతే దిగజారిపోతుంది.
ఇప్పుడు ఎన్నికలు లేకపోతే రజనీ గుర్తొచ్చేవారా అన్నది కొంత మంది సంధిస్తున్న ప్రశ్న. ఇది నిజంగానే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే.. దేశంలో ఎంతో మంది లెజెండరీ నటులు ఉన్నారు. చాలా మందికి అవార్డులు దక్కలేదు. ఏ బేసిస్ మీద ఎలాంటి అవార్డులిస్తున్నారో.. సరైన కొలమానాల్లేవు. అందుకే.. రాజకీయంతో కలిసిపోయిన వాళ్లకు మాత్రమే…. దక్కుతున్నాయి. రజనీకి ఈ సమయంలో అవార్డివ్వడం ద్వారా గౌరవించినట్లుగా కాకుండా అవమానించినట్లుగానే పరిస్థితి మారింది.