రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాలనుకుంటున్న రజనీకాంత్‌కు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయనపై కుటుంబసభ్యుల ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయాలు మనకు వద్దని ఆయన కుమార్తెలిద్దరూ… రజనీకాంత్‌పై ఒత్తిడి తెస్తున్నట్లుగా తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. కుమార్తెల విజ్ఞప్తిపై రజనీకాంత్ ఎలాంటి స్పందన వ్యక్తం చేశారన్నదానిపై…ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ.. కుటుంబసభ్యులు ఆరోగ్యమే ప్రధానమని.. రాజకీయాలు వద్దని చెబుతూంటంతో.. రజనీ మనస్ఫూర్తిగా పార్టీపై దృష్టి పెట్టగలరా అన్న చర్చ నడుస్తోంది.
రజనీకాంత్‌కు 70 ఏళ్లు వచ్చాయి. మామూలుగా రాజకీయాల్లో ఉన్న వారికైనా.. ఆ వయసు వస్తే.. రిటైర్మెంట్ లెక్కనే. అంతకు ముందు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న వారు… ఆ వయసుకు కొనసాగగలుగుతారేమోకానీ…. 70 ఏళ్ల వయసులో ఏంట్రీఇచ్చి సక్సెస్ అవడం అంత తేలిక కాదు. పైగా..న్యూ ఏజ్ పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వ్యూహాలు.. రాజకీయాలు అన్నీ.. ప్రజల కోణంలో కాకుండా.. కులాలు, మతాలు, ప్రాంతాల ఆధారంగా చేయాల్సి ఉంటుంది. పాత తరం ఆలోచనలు ఉన్న వారికి… ఇలాంటివి పెద్దగా పట్టవు. మన స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఎందుకన్న భావనలో ఉంటారు. రజనీకాంత్ కూడా..తన రాజకీయ లక్ష్యం కోసం..అలాంటి రాజకీయాలు చేయాలన్న ఆలోచన చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే రజనీకాంత్.. రాజకీయాల్లో సక్సెస్ కాలేరన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వైద్యులు… మానసికంగా కూడా… బలంగా ఉండాలని.. ఒత్తిడికి గురి కాకూడదని రజానీకాంత్కు సలహా ఇచ్చి పంపించారు. రాజకీయం అంటేనే.. మానసికంగా ఎంతో ఒత్తిడి ఉంటుంది. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూంటారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించగలగాలి. ఏ మాత్రం.. పరిగణనలోకి తీసుకున్నా మానసికంగా ఇబ్బంది పడతారు. అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే.. రజనీ కుమార్తెలు.. రాజకీయంగా కన్నా.. ఆయన ఆరోగ్యంగా తమతో ఉంటే చాలని అనుకుంటున్నారు. మరి రజనీ ఏమనుకుంటున్నారో వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.