తలవర్ 161… సూపర్ స్టార్ రజనీకాంత్ తీయబోతున్న తాజా చిత్రం పేరని ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ జీవిత కథ ఆధారంగా రూపొందే ఈ చిత్రానికి ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. హాజీ మస్తాన్‌ను డాన్ గానూ, స్మగ్లర్‌గానూ చిత్రీకరించవద్దని ఆయన దత్త పుత్రుడు సుందర్ శేఖర్ రజనీకాంత్‌కు లీగల్ నోటీసులు పంపారు. తన తండ్రిని చెడ్డవాడిగా చూపించవద్దని అందులో హెచ్చరించారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను రజనీ పోషిస్తారని తొలుత వార్తలొచ్చాయి. దావూద్ ఇబ్రహీంను హాజీ మస్తాన్‌కు గురువుగా భావిస్తారు. హాజీ మస్తాన్‌ను స్మగ్లర్‌గానూ, చెడ్డవాడిగానూ చూపించడం అంగీకారం కాదనీ, పైగా తము పరువు నష్టమని ఆ నోటీసులో శేఖర్ పేర్కొన్నారు. ఏ కోర్టు ఆయనను దోషి అని నిరూపించలేదనీ, శిక్ష కూడా వేయలేదనీ అందులో గుర్తుచేశారు. హాజీ మస్తాన్‌పై చిత్ర నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదు..కానీ ఆయన్ను చెడుగా చూపించకూడదంతేనంటున్నారు. హాజీ మస్తాన్ అసలు పేను మస్తాన్ హైదర్ మీర్జా. తమిళనాడుకు చెందిన ముస్లిం. అతడి ఎనిమిదేళ్ళ వయసులో తండ్రితో కలిసి ముంబైకి వలస వెళ్ళాడు. కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ వంటి గ్యాంగ్స్టర్లతో అతడి తండ్రి కలిసి పనిచేసేవాడు. స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, బాలీవుడ్ సినిమాలకు ఆర్థిక సాయం చేయడం వంటివి చేసేవారు. 20 ఏళ్ళపాటు హాజీ ముంబైలోని అండర్‌వరల్డ్‌ను శాసించారు. 2010లో హాజీపై తీసిన చిత్రంలో అజయ్ దేవ్గన్ ఆయన పాత్రను పోషించారు.
తాజా చిత్రంలో రజనీకాంత్ టైటిల్ పాత్రను పోషిస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని తలైవర్ 161 నిర్మాతలు చెబుతున్నారు. పిఎ రంజిత్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ నెలాఖరులో చిత్ర నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశముందంటున్నారు.