రజనీకాంత్ సినిమా అంటే… తెలుగులోనూ విపరీతమైన క్రేజ్. తమిళ సినిమా వసూళ్లని మించి తెలుగులో బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించిన సినిమాలెన్నో. రజనీ సినిమా వస్తోందంటే తెలుగులోనూ…. హంగామా మొదలైపోతుంది. `కాలా`కి అంత క్రేజ్ లేకపోయినా – ఈ సినిమా గురించి కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం తెలుగులో ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది రజనీ సినిమా. పోస్టర్‌పై రజనీ బొమ్మ కనిపిస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా.. `కాలా` సినిమాని తెలుగులో బాగానే ప్రమోట్ చేసుకున్నాడు రజనీ.
`కాలా`కి సంబంధించిన తొలి ప్రెస్ మీట్ (బహుశా ఇదే ఆఖరు కావొచ్చు) కాసేపటి క్రితం హైదరాబాద్‌లో జరిగింది. ఎవరేం మాట్లాడినా రజనీ స్పీచ్ కోసమే జనాలు ఎదురు చూస్తారు కదా? రజనీ కూడా.. కాస్త ప్రిపేర్డ్‌గానే ఈ ఫంక్షన్‌కి వచ్చినట్టున్నాడు. తెలుగు సెంటిమెంట్ దట్టించి – ఇక్కడి ప్రేక్షకుల్ని, అభిమానుల్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన కెరీర్ తొలి నాళ్లలో తెలుగు సినిమాలు బాగా చేశానని, తమిళ సినిమా కావాలా – తెలుగు సినిమా కావాలా అన్న సందిగ్థంలో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన తమిళ సినిమాని ఎంచుకోవాల్సివచ్చిందని, అయినా తన భాషా, ముత్తు, నరసింహా, చంద్రముఖి చిత్రాలకు భారీ వసూళ్లు దక్కాయని తమిళంలోలానే తెలుగులోనూ తన సినిమాల్ని బాగా ఆదరిస్తున్నారని గుర్తు చేశాడు రజనీ. హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ఎన్టీఆర్‌ని కలిసేవాడ్ని అని, దాసరి లేని లోటు తెలుస్తుందని ఆ లెజెండ్స్‌ని గుర్తు చేసి సెంటిమెంట్ టచ్ ఇచ్చాడు. `ఒక్కడే రజనీకాంత్` అంటూ ధనుష్ ఇచ్చిన ప్రశంసకు పొంగిపోకుండా `ఒక్కడే రజనీకాంత్ అని ధనుష్ అన్నాడు. ఒక్కడే చిరంజీవి, ఒక్కడే బాలయ్య, ఒక్కడే నాగ్…ఇలా అందరూ ఒకొక్కరే ఉంటారు. ఎవరి స్టైల్ వాళ్లది, ఎవరి స్థానాన్నీ ఎవరూ భర్తీ చేయలేరు` అంటూ తెలుగు స్టార్ హీరోల అభిమానుల మనసూ గెలుచుకున్నాడు. `కబాలి` ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. వస్తుంది, వస్తుంది అనుకున్న రోబో 2 వెనకెనక్కి వెళ్తోంది. అందుకే `కాలా` మీద రజనీ బాగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈనెల 7న కాలా విడుదల కానుంది. మరి రజనీ మహత్తు ఎలా ఉంటుందో… ఈ సినిమా ఎన్ని మ్యాజిక్కులు సృష్టిస్తుందో..?