చాలా కాలం తర్వాత మళ్లీ రజినీకాంత్ పార్టీకి సంబంధించి వార్తలు బయటకు వచ్చాయి. 2017 సంవత్సరం డిసెంబర్ లో పార్టీని ప్రకటించిన రజనీకాంత్ అప్పటినుండి తన పార్టీని సుషుప్తావస్థలో ఉంచేశాడు. అయితే 2019 డిసెంబర్ లో, అంటే దాదాపు పార్టీ పెట్టిన రెండు సంవత్సరాల తర్వాత తన పార్టీని తిరిగి లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడని, వచ్చే సంక్రాంతి లోపు పార్టీని యాక్టివ్ చేస్తాడని, 2020 సంవత్సరం మార్చి నుండి రజనీకాంత్ ప్రజలలోకి వస్తాడని, అప్పటి నుండి ఒక రెండేళ్లలో రానున్న ఎన్నికలకు పార్టీని పూర్తిగా సమాయత్తం చేస్తాడని రజినీకాంత్ పార్టీకి సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి.
అయితే రజనీకాంత్ రాజకీయాల లో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే, రాజకీయాల్లోకి వచ్చి పొరపాట్లు చేసిన తన తోటి నటుల నుండి ఆయన ఏమి నేర్చుకోలేదు అని, వారు చేసిన పొరపాట్లను ఆయన కూడా చేస్తున్నాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. 2009 ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ ఎన్నికలలో కేవలం 18 సీట్లతో సరిపెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మ్యాజిక్ నంబర్ కంటే కేవలం 7 సీట్లు అధికంగా వచ్చి అధికారాన్ని చేపట్టింది. చిరంజీవి గనక తగినంత సమయం తీసుకొని పార్టీని ఓపిక గా నిర్మించి ప్రజల లో విస్తృతంగా పర్యటించి, సరైన రాజకీయం చేసి ఉంటే, మరొక 8 సీట్లు ఎక్కువ సంపాదించుకొని ఉంటే, బహుశా ఆయన లక్ష్యాన్ని అందుకునే ఉండేవాడేమో. 2014లో పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా పొరపాటు పునరావృతం చేశారు. 2014లోనే పార్టీ స్థాపించినప్పటికీ, 2018 మార్చి వరకు కూడా జనసేన పార్టీ అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పార్టీని 2019 ఎన్నికల్లో దెబ్బ తీసింది. చివరి ఏడాది మాత్రమే కాకుండా మూడు సంవత్సరాల ముందే ప్రజా సమస్యలపై బలంగా పోరాడి ఉంటే ఫలితాలు మరొక రకంగా ఉండేవని జనసేన సమీక్ష సమావేశాలలో అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు రజనీకాంత్ కూడా ఇదే పొరపాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వీలైనంత త్వరగా పార్టీని ప్రకటించి ప్రజల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, మీనమేషాలు లెక్కపెడుతూ, సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ప్రజలలోకి వచ్చి హంగామా చేయాలని భావిస్తే ప్రజలు పార్టీని తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా బిజెపి అనుకూల పార్టీగా ముద్ర పడడం కూడా రజనీకాంత్ పార్టీ కి కీడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాడర్ పరంగా బలంగా ఉన్న రెండు పార్టీల మధ్య తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి రజనీకాంత్ కి ఈ సమయం సరిపోదనే విశ్లేషణ బలంగా వినిపిస్తుంది.