స్టార్లకంటే కథకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు మణిరత్నం. పెద్ద హీరోల డేట్ల కోసం ఎదురు చూడడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుబాటులో ఎవరుంటే వాళ్లతో సినిమా నడిపించేస్తారు. అవసరమైతే కొత్త నటీనటుల్ని వెదికిపట్టుకొని వాళ్లకు నగిషీలు చెక్కుతారు. అయితే ఎందుకో మణిరత్నం ఈమధ్య స్టార్ హీరోల వైపు దృష్టి మలర్చారనిపిస్తోంది. ‘నాయకుడు’ తరవాత ఇంతకాలానికి కమల్ హాసన్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పుడు రజనీకాంత్ తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారన్నది చెన్నై వర్గాల టాక్. రజనీకాంత్ తో ‘దళపతి’ తరవాత మణిరత్నం మళ్లీ పని చేయలేదు. దాదాపు 30 ఏళ్ల తరవాత ఈ కాంబోని మళ్లీ చూసే అవకాశం దక్కబోతోంది.
ఇటీవల రజనీకాంత్, మణిరత్నం మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగాయని, ఈ సినిమాలో నటించడానికి రజనీ తన అంగీకారం తెలిపారని టాక్. ఇదో పొలిటికల్ డ్రామా అని, నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథని మణిరత్నం రూపొందించారని తెలుస్తోంది. మణిరత్నం పొలిటికల్ డ్రామా తీసి చాలా కాలం అయ్యింది. రజనీ కూడా ఆ తరహా కథలో నటించి చాలా కాలమైంది. తమిళనాడు రాజకీయాల్ని కుదిపేసే ఓ అంశం ఈ కథలో ఉండబోతోందని సమాచారం అందుతోంది. రజనీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయాన్’ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ దసరాకు విడుదల కానుంది. ‘కూలీ’ చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘జైలర్ 2’ కథ కూడా తయారవుతోంది. మరో రెండు కొత్త సినిమాలకు సంతకాలు చేశారని తెలుస్తోంది. వీటి మధ్య మణిరత్నం చిత్రానికి ఎప్పుడు డేట్లు ఇస్తారో తెలియాల్సివుంది.