`నేనాటోవాడ్ని.. ఆటోవాడ్ని.. అన్నగారి రూటు వాడ్ని.. న్యాయమైన రేటువాడ్ని.`
అంటూ `బాషా`లో రజనీకాంత్ ఆటో డ్రైవర్ గా తన విశ్వరూపం చూపించాడు. తమిళనాట ఇప్పటికీ ఆటో డ్రైవర్లంతా రజనీకాంత్లానే ఫీలవుతుంటారు. ఇప్పుడు అదే ఆటో రజనీ రాజకీయ పార్టీకి గుర్తుగా మారబోతోందని టాక్.
ఈనెల 31న రజనీ రాజకీయ అరంగేట్రంపై ఓ ప్రకటన చేయనున్నారు. అదే రోజున పార్టీ పేరు, గుర్తు అధికారికంగా ప్రకటిస్తారు. రజినీకాంత్ పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ'(ప్రజాసేవ పార్టీ) అనే పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అలాగే ఆయన పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేసే అవకాశముంది. పార్టీ గుర్తుగా సైకిల్ ని సాధించాలని రజనీకాంత్ ప్రయత్నించారు. అయితే ఎన్నికల సంఘం.. సైకిల్ గుర్తుని కేటాయించడం కుదరదు అని తేల్చి చెప్పడంతో.. ఆటో గుర్తు తీసుకున్నట్టు తెలుస్తోంది.