నాయకుడు తరవాత మణిరత్నం – కమల్ హాసన్ కాంబో సెట్టయ్యింది. `పొన్నియన్ సెల్వన్` తరవాత.. మణిరత్నం చేస్తున్న సినిమా ఇదే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటుగా చాలామంది స్టార్లు కనిపించే అవకాశాలు ఉన్నట్టు టాక్. ముఖ్యంగా రజనీకాంత్ సైతం ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విక్రమ్, సూర్య, కార్తి గెస్ట్ రోల్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. మణిరత్నం వృద్దాప్యంలో పడ్డారు. ఆయన ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించడం లేదు. పైగా ఆమధ్య గుండె పోటుకు గురయ్యారు. పొన్నియన్ సెల్వన్ సినిమానే చాలా కష్టపడి పూర్తి చేశారు. కమల్ హాసన్ తో సినిమా పూర్తి చేసి, మణిరత్నం సినిమాలకు గుడ్ బై చెబుతారని ఇప్పటికే కోలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అందుకే కమల్ చిత్రాన్ని మరపురాని మైలురాయిగా మలచాలని మణిరత్నం భావిస్తున్నార్ట. మణిరత్నం అడిగితే.. కోలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా సరే `ఓకే` అంటారు. అందుకే.. ఈ ప్రాజెక్టులోకి వాళ్లందరినీ భాగస్వాములుగా చేయాలని మణిరత్నం భావిస్తున్నార్ట. రజనీ – కమల్ ఒకే తెరపై కనిపించి చాలా కాలమైంది. వాళ్లిద్దరూ లేటెస్టుగా సూపర్ హిట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి తెరపై కనిపిస్తే… ఇక చెప్పేదేముంది? కోలీవుడ్ లో కొత్త రికార్డులకు బీజం పడినట్టే.