రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖాయమైంది. ఈ మేరకు.. కొద్దిసేపటి క్రితం రజనీకాంత్ ఓ ప్రకటన చేశారు. 2021 ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. డిసెంబరు 31న పార్టీ వివరాలు ప్రకటిస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దాంతో.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా, రారా? అనే సందిగ్థతకు తెర పడినట్టైంది. 2021 మేలో… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అడుగులు ఎటువైపు అనే ఆసక్తి నెలకొంది. రజనీకాంత్ కి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ఆయన మీటింగులతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శకులు ఎద్దేవా చేసేవారు. ఇటీవల చెన్నైలో తన ఫ్యాన్స్ తో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు రజనీ. ఆ రోజే.. `త్వరలో నా నిర్ణయం చెబుతా` అని ప్రకటించారు. ఇప్పుడు.. అధికారికంగా జెండా ఎగరేసేశారు. రజనీకాంత్ కి తమిళనాట తిరుగులేని అభిమాన బలం ఉంది. ఆయన రాజకీయాల్లోకి వస్తే సమీకరణాలు మారతాయని ఆయన అభిమానుల నమ్మకం. ఇంతకాలం.. వేచి చూసే ధోరణిలో ఉన్న రజనీ.. ఎట్టకేలకు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.