సినిమా స్టార్లకు రాజకీయం రంగ ప్రవేశం డెడ్ ఈజీ. తెరపై కనిపించి, అప్పటికే ప్రజలకు పరిచయమై సెలబ్రిటీ హోదాలో వుంటారు కాబట్టి రాజకీయ పార్టీలు తారల కోసం పార్టీ తలుపు ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతాయి. పార్టీ ఏం కర్మ? ఏకంగా సొంతగానే పార్టీలని స్థాపించి రాజకీయాలని శాసించిన సినీ తారలు వున్నారు. దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశంతో సృస్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృస్టించారు ఎన్టీఆర్.
ఇక తమిళనాడులో సినీ రాజకీయానిది తారా స్థాయి. ఎంజీఆర్, కరుణానిధి, జానకీ రామచంద్రన్( ఎంజీఆర్ మూడో సతీమణి. ఈవిడ కూడా నటి, మంచి నృత్యకారిణి) జయలలిత. అంతకుముందు అన్నాదురైది కూడా సినీ నేపధ్యం వుంది. ఆయన మంచి స్టేజ్ రైటర్. పలు సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఆ రకంగా ఆయనకీ సినీ గ్లామర్ ఉంది. ఈ లెక్కన దాదాపు ఐదు దశాబ్దాల తమిళ రాజకీయం సినీ గ్లామర్ చుట్టూ తిరిగింది.
నాణానికి మరోవైపు వున్నట్టు ఎన్నో కలలతో సినిమా లోకం నుంచి రాజకీయంలో అడుగుపెట్టి చతికిలపడిన మెగాస్టార్లు కూడా వున్నారు. అమితాబ్ బచ్చన్. ఇండియన్ సినిమా అనే పుస్తకం వేస్తే.. కవర్ పేజీలో ఉండాల్సిన కటౌట్ బిగ్ బిది. అంతటి స్టార్ కూడా రాజకీయల్లో తేలిపోయారు. ఆయనకి రాజకీయం కలసి రాలేదు. పైగా ఆయన కెరీర్ నే ప్రశ్నార్ధకం చేసింది. ఏకంగా బోఫర్స్ స్కామ్ లో ఆయన పేరు వినిపించడం కలకలం రేపింది. తర్వాత ఆయన కంపెనీలు నష్టాల్లో నడిచాయి. ప్రధాని అయిపోతారేమో అనే అంచనాల మధ్య వచ్చిన బిగ్ బి .. రాజకీయం ఓ మురికికుంట అని అక్కడి నుంచి నిష్క్రమించారు. పైగా చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకున్నారు. అలాంటి కాలంలో నమ్మివచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు. అమర్ సింగ్ సాయం చేసినట్లు అప్పట్లో చెప్పుకున్నారు. ఆ కృతజ్ఞతతోనే అప్పుడప్పుడు బయటనుండే సమాజ్ వాదీ పార్టీకి అనుకూలంగా మాట సాయం చేసేవారు బిగ్ బి. అలా బిగ్ బి పొలిటికల్ సినిమాకి ఎండ్ కార్డ్ పడిపోయింది.
ఇక సౌత్ మెగా స్టార్ చిరంజీవి. తెలుగు సినిమా స్టామినాని వందరెట్లు పెంచిన ఘనత చిరంజీవిది. బాక్సాఫీసు రికార్డులని బద్దలు కొట్టి ఒక దశలో ఇండస్ట్రీ మొత్తం తనవైపు పోలరైజ్ చేసుకున్న వెండితెర మెరుపు మెగాస్టార్. ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన రాజకీయ చరిత్ర ఇంకా ఫ్రెష్ గానే వుంది. ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం అనే సినిమాలో హీరో అవుదాం అనుకోని వచ్చి ఇక్కడ పరిస్థితి తట్టుకోలేక తన సినిమానే వేరే నిర్మాతకి ( కాంగ్రెస్ పార్టీ ) ఇచ్చేసి ఆ సినిమాలో ఓ క్యారెక్టర్ అవకాశం అందుకొని ( మంత్రి పదవి) ఆ సినిమా పూర్తయిన తర్వాత ‘’బాబోయ్ ఈ రాజకీయ వేషాలొద్దు.. సినిమా వేషాలే ముద్దు’’ అని మళ్ళీ కళామతల్లి వద్దకు చేరిపోయారు. చిరు రాజకీయం కధ అలా ముగిసిపోయింది.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే .. మెగాస్టార్ తర్వాత అంతటి స్థాయి స్టార్. ఇప్పుడు ఆయన జనసేనాని. తొలి ప్రయత్నం విఫలం. ఆయన పొలిటికల్ సినిమా ఇంటర్వెల్ లో వుంది. ఎలాంటి ముగింపు వుంటుందో ఇప్పుడే చెప్పలేం.
ఇప్పుడు మరో సూపర్ స్టార్ రాజకీయ ప్రకటన చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళనాట రజనీకాంత్ అభిమానులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రకటన ఇది. ఎట్టకేలకు వెలువడింది. జనవరిలో రజనీ పార్టీ స్థాపన వుంటుంది. ఏప్రిల్ లో తమిళనాడులో ఎన్నికలు వచ్చే అవాశం వుంది. ఈ టైం లైన్ చూస్తుంటే ఎన్టీఆర్, చిరంజీవిల పార్టీ ప్రకటనలు సహజంగానే గుర్తు వస్తాయి. ఎన్నికలకి తొమ్మిది నెలల ముందు పార్టీ ప్రకటించి సంచలనం సృస్టించారు ఎన్టీఆర్. మెగాస్టార్ ఇంకొ నెల తగ్గించి ఎనిమిది నెలలు ముందు ప్రకటన చేశారు. అయితే ఎన్టీఆర్ కి వర్క్ అవుట్ అయ్యింది కానీ మెగాస్టార్ కి వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు రజనీకాంత్ మరో రెండు నెలలు తగ్గించి ఆరు నెలలే టైం పెట్టుకున్నారు.
రెండు దశాబ్దాలు రాజకీయాల్లోకి వస్తానంటూ వాయిదాల పర్వం కొనసాగించిన రజనీ .. ఇప్పుడు ఇంత తక్కువ టైంలో పార్టీని స్థాపించి విజయం సాధించడం అంటే.. ఏడాది మొత్తం టైమ్ పాస్ చేసిన స్టూడెంట్ పొద్దున్న పరీక్ష పెట్టుకొని రాత్రిమొత్తం చదివేసి పాస్ అయిపోదామనుకునే ప్లాన్ లాంటిందనే అభిప్రాయలు ఇప్పటికే వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ తక్కువ సమయంలో రజనీ దగ్గర వున్న వ్యూహాలు ఏమిటో అన్నది కూడా ప్రశ్నే. తలైవా అయితే కాన్ఫిడెంట్ గానే ప్రకటన చేశారు. మరి అది కాన్ఫిడెన్సా ? ఓవర్ కాన్ఫిడెన్సా అనేది కాలం చెప్పాలి.
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతుంటాయి. ఎన్టీఆర్ సమయంలో వున్న పరిస్థితులు చిరు సమయంలో లేవు. రాజకీయాలకు పరిస్థితులే ముడిసరుకు. పరిస్థితులకు తగ్గట్టు పాయింట్ ఎత్తుకోవాలి. ఎన్టీఆర్ ఇదే చేశారు. ”మన రాష్ట్రాన్ని మనం పాలించుకోలేమా ? ఎవడో ఢిల్లీ వాడు ఇక్కడి రావాలా ? ఇలా పాలించండని ఢిల్లీ వాడు చెప్పాలా ? వాడు చేసేది ఏంటి? మనం చేసుకోలేమా ?’’ ఇలా పాయింట్ ఎత్తుకున్నారు ఎన్టీఆర్.
సూపర్ హిట్ పాయింట్ఇది. భలే పన్జేసింది. సినిమాలకే కాదు రాజకీయాలకు కొత్త పాయింట్ కావాలి. చిరంజీవి విషయానికి వచ్చేసరికి ఆయనకి అలాంటి పాయింట్ దొరకలేదు. ”సామాజిక న్యాయం” అని ఏదో పేపర్ నినాదం అందుకున్నారు. అది ఎవరికీ అర్ధం కాలేదు. తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ పక్కగా చూసుకునే మెగాస్టార్.. పార్టీ విషయానికి వచ్చేసరికి మాస్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేయలేకపోయారు. ఈ ”సామాజిక న్యాయం” అనే మాట ఎంతమంది అర్ధం అయ్యిందో కూడా తెలీదు. దాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం కూడా జరిగినట్లు లేదు. అన్నిటికీ మించి రాజకీయ శూన్యత లేదు. మరో ప్రాంతీయ పార్టీ అవసరం అంతగా లేదు.
అయితే ఇప్పుడు రజనీకాంత్ ఇలాంటి పరిస్థితి లేదు. తమిళనాట రాజకీయ శూన్యత వుంది. అన్నాదురై, ఎంజీఆర్ తర్వాత అక్కడి రాజకీయాలను శాసించిన కరుణానిధి, జయలలిత.. ఇద్దరూ లేరు. డీఎంకేపై కరుణానిధి కుమారుడు స్టాలిన్ పట్టుపెంచుకున్నా.. సోదరుడు అళగిరి సొంత పార్టీలోనే అప్పోజిషన్ లా మారాడు. ఇక అన్నాడీఎంకే అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్నా.. బలమైన నాయకత్వం మాత్రం లేదు. ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య పొసగడం లేదు. ఇప్పుడు తమిళనాడు బలమైన రాజకీయ నాయకుడి కోసం ఎదురుచూస్తుంది. ఏంజీఆర్, కరుణానిధి, జయలలిత స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి కావాలి. అవసరం వుంది కూడా. మరి ఈ శూన్యతని రజనీకాంత్ ఎలా వాడుకుంటారో చూడాలి.
రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం. వ్యక్తిత్వం పరంగా రజనీకి తిరిగులేదు. ఆయనకి క్లీన్ ఇమేజ్ వుంది. అభిమానుల ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. పైగా దానకర్ణుడనే ఇమేజ్ కూడా వుంది. అభిమానులని, నిర్మాతలని, తనని నమ్ముకొని వచ్చిన వారిని ఆదుకుంటాడనే మంచి పేరు రజనీ సొంతం. రజనీ ధాత్రుత్వం గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. పైగా రజనీ వివాదరహితుడు. ఇన్నాళ్ళ సినీ జీవితంలో ఆయనపై ఒక్క వివాదం రాలేదు. ఆయన కూడా నోరు పెంచి ఎవర్నీ ఒక్కమాట అన్న సందర్భం లేదు. ఇటు అన్నాడీఎంకే కానీ అటు డీఎంకే పార్టీలతో ఆయనకు వైరం లేదు. పెద్ద స్నేహం కూడా లేదు. రాజకీయంగా సమదూరంలో వున్నారు. ఇప్పుడు వాళ్ళు వున్నఫలంగా రజినీని కార్నర్ చేసే ఛాన్స్ వుండదు. ఒకవేళ రజినీపై నోరు పెంచి మాట్లాడినా ప్రజలకు అర్ధమైపోతుంది. అయితే ఈ క్యాలిటీస్ చిరంజీవిలో కూడా కనిపించాయి. రాజకీయంలో అవి పెద్దగా కలసిరాలేదు. మరి రజనీ తన ఇమేజ్ ని ఎలా వాడుకుంటారనేది కూడా ముఖ్యం.
రజనీ ముందు చాలా సవాళ్ళే వున్నాయి. చాలా తక్కువ సమయం వుంది. ఇప్పుడు ఆయన బలం ఫ్యాన్స్. అయితే పార్టీని గెలిపించడానికి ఈ ఫ్యాన్స్ ఒక్కరే సరిపోరు. మెగాస్టార్ విషయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా. గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ నిర్మించుకోవాలి. రజనీ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా ఉన్నప్పటికీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాలని ఏర్పాటు చేయాలి. అందుకోసం సరైన వారిని పట్టుకొని వాళ్ళని ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా యువతని ఆకర్షించాలి. వాళ్ళని తనవైపు తిప్పుకొవాలి. ఎన్టీఆర్ ఈ పని గొప్పగా చేశారు. అప్పటికి వున్న యువ నేతలని గుర్తించి వాళ్ళని రాజకీయాల వైపు తెచ్చి గొప్పగా పని చేయించారు. మెగాస్టార్ విషయంలో అది జరగలేదు. చాలా మంది జంప్ జిలానీలు చిరు పక్కన చేరారు. ఆ రకంగా ఆయన కొంత నష్టపోవాల్సి వచ్చింది. పైగా ఎన్నికల ముందు పార్టీ ప్రకటించి టికెట్లు అమ్ముకోవడానికే పార్టీ పెట్టారనే ప్రచారంని మెగాస్టార్ తిప్పికొట్టలేకపోయారు. రజనీ విషయంలో కూడా ఈ ఆరోపణ వచ్చే అవకాశం వుంది. ఈ విషయంలో రజనీ చాలా అలర్ట్ గా వుండాలి. ఇక తమిళ రాజకీయాల్లో కుల సమీకరాణాలు కూడా మెండు. వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో అన్నది కూడా ముఖ్యం. ఇంకొ సంగతి రజనీ ఒరిజినల్ తమిళుడు కాదు అనే పాయింట్ ని ప్రతి పక్షాలు తెరపైకి తీసుకురావచ్చు. రజనీ మరాఠి మన రాష్ట్రాన్ని ఓ మరాఠి చేతిలో పెడదామా ? అనే ఎమోషన్ ని రెచ్చగొట్టవచ్చు. దిన్ని చాలా సున్నితంగా తిప్పికొట్టాలి. ముఖ్యంగా తాను ప్రజలకు ఏం చేయాలనీ అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలగాలి. ఏ మార్పులు తీసుకొస్తారో వివరించాలి.
అన్నిటికికంటే ముఖ్యం రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం మర్చిపోకూడదు. ఇక్కడ ఓపిక వుండాలి. సహనం వుండాలి. ఒక ఎన్నిక పొయిందని నిరాస పడిపోవడం, విమర్శ వచ్చిందని దిగులు చెందడం, ఆరోపణ చేశారని చిన్న బుజ్జుకోవడం … ఇలాంటి యాటిట్యూడ్ పనికి రాదు. గెలుపు, ఓటమి రెండూ శాశ్వతం కావు. గెలుపు కోసం ప్రయత్నించడం, మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించడమే రాజకీయ పాఠం. ఒక్క సీటుతో మొదలైన బిజెపి ఇప్పుడు దేశాన్ని ఏలుతుంది. ‘’రిటైరైనా క్రికెటర్ వి. కామెంట్రీ చెప్పుకుంటూ రోజుకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఇంట్లో వుండకుండా నీకుందుకు పాలిటిక్స్? ” అని విమర్శలు ఎదురుకున్న ఇమ్రాన్ ఖాన్ … ఈ రోజు ఓ దేశానికి ప్రధాన మంత్రి. సో.. ఇక్కడ స్థిరత్వం ముఖ్యం. పట్టువదలని విక్రమార్కుడిలా వుండాలి. మరి రజనీ రాజకీయ ప్రయాణం ఏ తీరాలకు అన్నది వెయిట్ అండ్ సీ.