పదవులను మించిన ప్రజాభిమానంతో ప్రముఖులుగా వున్న వారు ఏదైనా మాట్లాడేముందు స్పష్టత వుండాలి. దాగుడు మూతలు, శ్లేష సుతరామూ పనికిరావు. ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అన్న రజనీకాంత్ నిజజీవితంలో రాజకీయ పాత్రపై వందసార్లు చెప్పినా ఒక్కటి కూడా అర్థం కాలేదని గతంలో నేనన్నాను. దీనికి రెండు కారణాలు ఒకటి ఆయన రాజకీయ ఆకాంక్ష. రెండు వున్నది పోతుందనే ఆందోళన. తాజాగా అయిదు రోజుల పాటు అభిమానులతో జరిపిన ముఖాముఖిలో తన వ్యాఖ్యలు ఇంకా గజిబిజని పెంచినప్పటికీ రాజకీయ కోణాలు బయిటపడ్డాయి.దేవుడు శాసిస్తే రేపే వస్తానేమోనని ఆయన అన్నారు.1996లో డిఎంకెను బలపర్చి తప్పు చేశానని చెప్పుకున్నారు.ఇటీవల మళ్లీ బిజెపి నేతలను కలుస్తున్నారు.రాజకీయాల్లోకి రానంటూనే వస్తే స్వచ్చంగా వుంటానని సూక్తులు చెబుతున్నారు. ఇక ఆఖరిదైన అయిదవ రోజు ఆయన ప్రవచనాలు మరీ వింతగా వున్నాయి. రాష్ట్రంలో డిఎంకె అధినేత స్టాలిన్, అంభిమని రామదాసు వంటి మంచి రాజకీయ నాయకులు వున్నా వ్యవస్థ చెడిపోయింది గనక వారు చేయగలిగింది వుండటం లేదన్నారు.అంటే దీనిఅర్థం మంచినాయకుడిగా తాను రావలసిన అవసరం వుందనే కదా! ఎప్పుడు వచ్చినా అవినీతిని చీల్చి చెండాడతానని కూడా చెప్పారు. తనను రాజకీయ ప్రశ్నలు వేయొద్దన్న సూపర్‌స్టార్ స్వయంగా ఇవన్నీ చేయడం దేనికి నిదర్శనం? రజనీ రాజకీయాల్లోకి రాకుండా వుంటే మంచిదని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి అంటున్నారు. ఏతావాతా జయలతిత మరణం, శశికళ జైలు తరహాలోనే ఇది కూడా ఒక రసవత్తర నాటకగా మారింది. ఇందులో తలైవా ఎంట్రీ ఇచ్చినట్టే .