తలైవా రజనీకాంత్ “కాలా”సినిమాను కర్ణాటకలో విడుదల చేసుకునేందుకు చివరి ప్రయత్నం చేశారు. “కాలా” విడుదలకు సహకరించాలని ఓ ప్రకటనలో కర్ణాటక సీఎం కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. సినిమా విడుదలను అడ్డుకోవద్దని కన్నడ సంఘాలను కోరారు. కావేరీ విషయంలో తాను ఎలాంటి తప్పుడు ప్రకటన చేయలేదని..రజనీకాంత్ స్పష్టం చేశారు..” కన్నడ సోదరులకు నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. “కాలా” సినిమా చూడాలనుకుంటున్న కన్నడ సోదరులను అడ్డుకోకుండి. సినిమా విడుదలను ఆపకండి..” అని ప్రకటనలో తలైవా విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కాలాను నిషేధించాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరో వైపు సినిమా రిలీజ్ ను ఆపాలంటూ.. దాఖలైన పిటిషన్ ను సుప్రంకోర్టు కొట్టి వేసింది. సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ ఎ.కె. రాజశేఖరన్ అనే వ్యక్తి దీన్ని దాఖలు చేశారు. ఈ సినిమా కథ, కథనాలు, కాపీ రైట్ను గల తన నుండి అనుమతి తీసుకోకుండా సినిమాను తీశారని పిటిషన్ లో రాజశేఖరన్ పేర్కొన్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ విచారణలో ఉంది. విడుదలకు ఆటంకాలు తొలగిపోయినా.. కర్ణాటకలో మాత్రం .. కాలా షో పడుతుందా లేదా అన్న టెన్షన్ మాత్రంలా యూనిట్ ను వదిలి పెట్టడం లేదు. కన్నడ ఫిల్మ్ చాంబరే బ్యాన్ డిమాండ్ చేస్తూండటమే దీనికి కారణం. కన్నడ ఫిల్మ్ చాంబర్ సహకరించకుండా విడుదల చేయడం దాదాపుగా అసాధ్యం కావొచ్చు.
అయితే కర్ణాటకలో పాక్షికంగా అయినా విడుదల చేసేందుకు కాలా యూనిట్ ప్రయత్నించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ధియేటర్ల లిస్ట్ అంటూ బయటకు రాలేదు. కన్నడ పరిరక్షణ వేదిక కార్యకర్తల దాడుల భయంతో… ఫలానా థియేటర్లో సినిమా ప్రదర్శిస్తారని చెప్పలేక పోతున్నారు. అయితే కోర్టు ఆదేశాలు అనుకూలంగా ఉండటంతో.. పోలీసులు భద్రత కల్పిస్తామని హామీ ఇస్తూండటంతో… వీలైనన్ని ధియేటర్లలో రిలీజ్ చేయాలన్న భావనలో యూనిట్ లో ఉంది. సినిమాకు, రాజకీయాలకు సంబంధం లేదు..కాబట్టి.. సక్సెస్ టాక్ వస్తే.. కన్నడ సంఘాలు వెనక్కి తగ్గుతాయని ఆశ పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా రజనీకాంత్ సినిమా కర్ణాటకలో విడుదలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది.