నరసింహా సినిమాలో.. పెళ్లికొడుకు వీడే.. చొక్కా గురించి మాత్రం నాకు తెలియదనే కామెడీ సిరీస్‌ను.. రజనీకాంత్ రాజకీయాల్లో నిజం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. తాను బీజేపీ ట్రాప్‌లో పడబోనని ప్రకటనలు చేస్తున్నారు. తమిళనాడులో రాజకీయంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీలో రజనీకాంత్ చేరుతారన్న ప్రచారం కొంత కాలంగా సాగోతోంది. గతంలో ఆధ్యాత్మిక పాలిటిక్స్ అంటూ రజనీ చెప్పడంతో.. ఆయన కాషాయంతో కలిసిపోతున్నారని బీజేపీ నేతలు కూడా భావించారు. పలుమార్లు నరేంద్రమోడీ, అమిత్ షాలు రజనీకాంత్‌ను కలిశారు. రజనీ కాంత్ కూడా వారిపై పొగడ్తల వర్షం కురిపించారు. బీజేపీలోకి రమ్మని అడుగుతూనే ఉన్నారని… నాకు బీజేపీ రంగు పూసేందుకు ప్రయత్నం జరుగుతూనే ఉందని… రజనీకాంత్ చెప్పుకొస్తున్నారు. కానీ తాను ట్రాప్‌లో పడబోనంటున్నారు.
రాజకీయాల్లోకి వస్తానంటూ గతంలో ప్రకటించిన రజనీకాంత్.. ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అప్పుడప్పుడు అభిమానులతో సమావేశాలు అవుతున్నా.. పార్టీ ఏర్పాటుతో పాటు ఇతర నిర్ణయాలపై మౌనం ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఇప్పటికే రజనీకాంత్ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. పైగా మోదీ పాలన అద్భుతమన్నారు. ఆర్టికల్ 370ను సమర్ధించారు. దీంతో రజనీ ఏనాటికైనా కమలం గూటికి చేరుతారంటూ ప్రచారం సాగింది. విపక్షాలు కూడా బీజేపీ గూటి పక్షేనంటూ విమర్శలు చేశారు. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందని, తాను రాజకీయాల్లోకి వచ్చే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెబుతున్నారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న బీజేపీకి… రజనీకాంత్ ఓ సందేశం పంపారు.
అయితే రజనీకాంత్.. ఎవరు ఔనన్నా.., కాదన్నా.. ఆయన బీజేపీ బాటలోనే ఉన్నారని కాషాయ నేతలు నమ్ముతున్నారు. ఆయన రాజకీయ.. పయనంపై ఇప్పటి వరకూ వేసిన అడుగులు చూస్తే.. సొంతంగా పార్టీ పెట్టడం.. దాన్ని నిలబెట్టడం.. ప్రజల్లోకి తీసుళ్లడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన కచ్చితంగా.. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే.. బీజేపీ పంచన చేరక తప్పదంటున్నారు… ఆ పార్టీ నేతలు. అందుకే.. ఇవాళ.. ఆయన వేసుకున్న చొక్కా గురించి.. రేపు ఆయనది కాదని.. చెప్పుకుంటారని… వారు ఆశతో ఉన్నారు.