తమిళ తలైవా రజనీకాంత్ పై భారతీయ జనతా పార్టీచాలా ఆశలు పెట్టుకుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని ఖాళీ చేయించి.. అది రజనీకేనని.. మీడియాలో ప్రచారం ప్రారంభించింది. ఆ ప్రచారం ఆధారంగా… బీజేపీ పెద్దలు… రజనీకాంత్ తో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. రజనీకాంత్ మాత్రం.. ఎప్పట్లాగే.. స్థితప్రజ్ఞతతో ఉంటున్నారు. ఆయన రాజకీయాలపై ఎవరితోనూ మాట్లాడటం లేదు. రోజూ షూటింగ్లకు వెళ్తున్నారు. వస్తున్నారు. కానీ ఆయన తరపున మాత్రం చాలా మంది మాట్లాడేస్తున్నారు. కొంత మంది బీజేపీకి అనుకూలంగా.. కొంత మందికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.
రజనీకాంత్ బీజేపీ.. తమిళనాడు అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెడీగా ఉన్నారని.. ఆయన ఎంపిక లాంఛనమేనని.. మూడు రోజుల పాటు తమిళనాడులో.. ప్రచారం హోరెత్తింది. అయితే.. హటాత్తుగా.. ఇప్పుడు… రజనీకాంత్ కు సన్నిహితులైన మరికొంత మంది.. అలాంటి చాన్సే లేదనే వాదన తీసుకొచ్చారు. రజనీకాంత్ సొంత పార్టీ పెట్టాడనికే మొగ్గు చూపుతున్నారని.. బీజేపీలో చేరే అవకాశమే లేదని.. మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. దీంతో… తమిళనాడు రాజకీయవర్గాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.
నిజానికి మొదటి నుంచి.. రజనీకాంత్ స్టైలే అంత. ఆయన రాజకీయాల్లోకి వస్తారా… రారా అన్నదానిపై నెలల తరబడి చర్చ జరిగింది. చివరికి ఆయన తాను వస్తా అని ప్రకటించి.. అభిమానులతో సమావేశమయ్యారు. కానీ ఇంత వరకూ అధికారికంగా పార్టీని ప్రకటించలేదు. అయితే.. రాజకీయాల్లోకి వస్తా.. వస్తా అనే చెబుతున్నారు. కానీ ఆ దిశగా సీరియసగా ఎలాంటి చర్యలూ లేవు. కానీ.. సినిమాల లైనప్ మాత్రం.. చాలా ఎక్కువగానే ఉంది. ఆ సినిమాలు పూర్తి కావాలంటే.. మరో రెండేళ్లు పడుతుంది. ఈ వ్యవహారాలన్నీ చూసి.. రజనీకాంత్ పై గట్టిగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి.. బీపీ పెరుగుతోంది. కానీ రజనీకాంత్ మాత్రం.. అప్పుడప్పుడు.. మోడీ , షాలను పొగుడుతూ… మిగతా విషయాలపై… నిమిత్తమాత్రుడిగా వ్యవహరిస్తున్నారు.